మహారాష్ట్రలో రెమ్‌డెసివర్ పై రగడ

మహారాష్ట్రలో రెమ్‌డెసివర్ పై రగడ
  • యాంటీ వైరల్ డ్రగ్‌‌ను విదేశాలకు పంపుతున్నారంటూ
  • ఫార్మా కంపెనీ డైరెక్టర్‌‌ను ప్రశ్నించిన పోలీసులు
  • ప్రభుత్వం, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం 
     

ముంబై: కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ కోసం వాడుతున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ విషయంలో మహారాష్ట్ర అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెమ్డెసివిర్ ను ఓ ఫార్మా కంపెనీ విదేశాలకు ఎగుమతి చేస్తోందంటూ ఆ కంపెనీ డైరెక్టర్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మాజీ సీఎం ఫడ్నవీస్ సహా పలువురు బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రజలు చనిపోతున్నా బీజేపీ నేతలకు అవేమీ పట్టడం లేదని, రెమ్డెసివిర్ మందును భారీ ఎత్తున విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని రూలింగ్ పార్టీ నేతలు ఆరోపించారు. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన ఆ మందును మహారాష్ట్ర ప్రజల కోసం వినియోగించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని, దీనిపై రూలింగ్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఫడ్నవీస్ అన్నారు. 
60 వేల వయల్స్ పంపుతున్నారంటూ.. 
దేశంలో రెమ్డెసివిర్‌ కు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో దీనిని విదేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్రం బ్యాన్ విధించింది. అయితే మహారాష్ట్రకు చెందిన బ్రూక్ ఫార్మా కంపెనీ 60 వేల రెమ్డెసివిర్ వయల్స్ ను ఎక్స్ పోర్ట్ చేస్తోందన్న సమాచారం వచ్చిందంటూ పోలీసులు శనివారం సాయంత్రం ఆ కంపెనీ డైరెక్టర్ రాజేశ్ డొకానియాను అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఆర్ధరాత్రి తర్వాత ఆయనను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ముంబైలోని విల్లే పార్లీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఫడ్నవీస్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. కంపెనీ వద్ద ఉన్న మందును మహారాష్ట్ర ప్రజలకు పంపిణీ చేసేందుకు తామే కొనుగోలు చేస్తున్నామని, ఇందుకోసం పర్మిషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కూడా కోరామన్నారు.