ఢిల్లీ,ముంబైలో రెస్టారెంట్లకు మళ్లీ కరోనా ఎఫెక్ట్

ఢిల్లీ,ముంబైలో రెస్టారెంట్లకు మళ్లీ కరోనా ఎఫెక్ట్

కరోనా నుంచి బయటపడ్డామనుకున్న రెస్టారెంట్‌‌ ఇండస్ట్రీ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. సెకండ్‌‌వేవ్‌‌ రూపంలో కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. చాలా రాష్ట్రాల్లో నైట్‌‌ కర్ఫ్యూలు, లాక్‌‌డౌన్‌‌లు, రిస్ట్రిక్షన్లు మొదలుకావడంతో రెస్టారెంట్ల యజమానులు తలపట్టుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై వంటి పెద్ద సిటీల రెస్టారెంట్లు 70 శాతం వరకు మాత్రమే నిండుతున్నాయి. రెస్టారెంట్లు/హోటళ్లను 50 శాతం సీటింగ్‌‌ కెపాసిటీతోనే నడపాలని ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆదేశించాయి.  కేసులు పెరుగుతున్నాయనే భయంతో జనం కూడా బయట తినడానికి ఇష్టపడటం లేదు. ‘‘పరిస్థితులు బాగా లేవు. స్టాండెలోన్ రెస్టారెంట్లకు 70 శాతం సేల్స్‌‌ డిన్నర్‌‌ సర్వీస్‌‌ ద్వారానే వస్తాయి. ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టడం వల్ల రెస్టారెంట్లను రాత్రి తొమ్మిదింటికే మూయాల్సి వస్తోంది. మెట్రో సిటీల జనం రాత్రి తొమ్మిదింటి తరువాతే డిన్నర్‌‌కు వస్తారు. తాజా రిస్ట్రిక్షన్ల వల్ల మా బిజినెస్‌‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి’’ అని రీతూ దాల్మియా రెస్టారెంట్స్ సీఈఓ నకుల్‌‌ చంద్ర అన్నారు. 


మహారాష్ట్రలో పూర్తిగా బంద్‌‌
ఇన్‌‌సైడ్‌‌ హోటల్స్‌‌ తప్ప మిగతా రెస్టారెంట్లను, బార్లను మూసేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డెలివరీలకు, టేవ్‌‌ అవేలకు మాత్రం పర్మిషన్లు ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిన్న రెస్టారెంట్లు మరిన్ని మూతబడతాయని, గత ఏడాది మాదిరే చాలా మంది జాబ్స్‌‌ పోతాయని ఇండస్ట్రీవాళ్లు అంటున్నారు. రిగా రెస్టారెంట్స్‌‌ ఢిల్లీలో మూడింటిని, గోవాలో ఒక రెస్టారెంటును మూసేసింది. రిస్ట్రిక్షన్లు మరో 45 రోజుల్లో ఉంటే చాలా రెస్టారెంట్లకు తాళాలు పడతాయని చంద్ర హెచ్చరించారు. ఈ ఏడాది జనవరిలో కరోనా కేసులు బాగా తగ్గడంతో, రెస్టారెంట్ల బిజినెస్‌‌ దాదాపు సాధారణస్థాయికి చేరింది. ఇప్పుడు రికవరీకి మరోసారి అడ్డుకట్టపడిందని అజ్యూర్‌‌ హాస్పిటాలిటీకి చెందిన కబీర్‌‌ సూరి అన్నారు. ఈ నెల తమ బిజినెస్‌‌ దాదాపు 50 శాతం తగ్గిందని, గవర్నమెంటు సాయం చేయకుంటే ఇక నుంచి రెస్టారెంట్లను కొనసాగించడం కష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఫుడ్‌‌ డెలివరీ వల్ల మాకు పెద్దగా లాభాలు ఉండవు. డైన్‌‌ ఇన్‌‌తోనే ఆదాయం ఎక్కువ వస్తుంది. కరోనా ముందు బిజినెస్‌‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఆదాయం 35 శాతం లోపే ఉంటోంది’’ అని ఫార్జీ కేఫ్‌‌, మసాలా లైబ్రరీ రెస్టారెంట్లు నడిపే జొరావర్‌‌ కల్రా చెప్పారు.
గత ఏడాది లాక్‌‌డౌన్‌‌తో ఘోరంగా నష్టపోయిన రెస్టారెంట్లు/హోటళ్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుండగా, సెకండ్‌‌వేవ్‌‌ మరోసారి వీటిని దెబ్బకొడుతోంది. ఢిల్లీ సహా చాలా రాష్ట్రాలు రెస్టారెంట్ల సీటింగ్‌‌ కెపాసిటీ 50 శాతం దాటొద్దని ఆదేశించాయి. రాత్రి ఎనిమిదింటిలోపు మూసేయాలని స్పష్టం చేశాయి. మహారాష్ట్ర వంటి చోట్ల అయితే రెస్టారెంట్లు/హోటళ్లను పూర్తిగా మూసేశారు. 

నిర్మాణాలు బంద్‌‌
చాలా కంపెనీలు నిర్మాణంలో ఉన్న తమ హోటళ్ల/రెస్టారెంట్ల పనులను ఆపేస్తున్నాయి. జొరావర్‌‌ ఐదు రెస్టారెంట్లను నిర్మిస్తుండగా, ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడంతో ఆపేశారు. మరో నాలుగు నెలల తరువాత పరిస్థితి సాధారణస్థాయికి రావొచ్చని ఆయన ఆశాభావం ప్రకటిస్తూనే, వచ్చే నెల నుంచి చాలా రెస్టారెంట్లు/హోటల్స్‌‌ మూతబడతాయని స్పష్టం చేశారు. చాలా మంది జాబ్స్ పోతాయని హెచ్చరించారు. గతంలో తీసేసిన వారిని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా మళ్లీ అడగాల్సిన దుస్థితి వచ్చిందని బాధపడ్డారాయన. వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి అద్దెలను తగ్గించాల్సిందిగా రెస్టారెంట్ల యాజమాన్యాలు షాపింగ్‌‌ మాల్స్‌‌ను, డెవెలపర్లను కోరుతున్నాయి. అద్దెలు తగ్గకుంటే వ్యాపారాలను పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి ఉందని ‘వావ్‌‌! మోమో ఫుడ్స్‌‌’ సీఈఓ, కో–ఫౌండర్‌‌ సాగర్‌‌ దర్యానీ స్పష్టం చేశారు.