ఆర్ఫనేజెస్, ఓల్డేజ్ హోమ్స్​పై కరోనా​ ఎఫెక్ట్

ఆర్ఫనేజెస్, ఓల్డేజ్ హోమ్స్​పై కరోనా​ ఎఫెక్ట్
  • రెండేళ్లుగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న హోమ్స్
  • వైరస్​ భయంతో తగ్గిపోయిన విజిటర్స్

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు డొనేషన్స్​విరివిగా వచ్చేవి. ఇండివిడ్యువల్ గా, గ్రూపులుగా వెళ్లి విరాళాలు ఇచ్చేవారు. చాలామంది తమ బర్త్​డేలను, వారికి ఇష్టమైన రోజులను ఆర్ఫనేజెస్, ఓల్డేజ్​హోమ్స్​లోనే జరుపుకునేవారు. కరోనా ఎంటర్​అయినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొదట్లో సిటీలోని చాలా చోట్ల ఆర్ఫనేజెస్ ​నడిపేందుకు చుట్టుపక్కల వారు ఒప్పుకోలేదు. అభ్యంతరాలు తెలిపారు. వరుస లాక్​డౌన్లతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయి ఆశ్రమాలకు డొనేట్​ చేసేవారు కూడా తగ్గిపోయారు. క్రమంగా విరాళాలు పడిపోతూ వచ్చాయి. సెకండ్ వేవ్ తర్వాత కొంత బెటర్​అయినప్పటికీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. దీంతో కొన్నాళ్లుగా ఆశ్రమాల నిర్వాహకులే ప్రత్యేకంగా వెహికల్స్​ తీసుకుని వీధి.. వీధి తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి పాత బట్టలు, కూరగాయాలు, డబ్బులు కలెక్ట్​చేస్తున్నారు. 

వెయ్యికి పైగా ఆశ్రమాలు
గ్రేటర్ వ్యాప్తంగా వెయ్యికి పైగా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అందులో వేల మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో స్ట్రీట్ చిల్డ్రన్, సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలు, పిల్లలు వదిలేసిన, చూసుకోవడానికి ఎవరూ లేని వృద్ధులు ఉన్నారు. ఒక్కో హోంలో కెపాసిటీని బట్టి వంద మంది వరకు షెల్డర్ పొందుతున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే హోమ్స్​నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ, కొవిడ్​నేపథ్యంలో మిగిలిన వాటి నిర్వహణ భారంగా మారింది. విరాళాలు తగ్గిపోయాయి. ఫస్ట్, సెకండ్​వేవ్స్​టైంలో పలు ఆశ్రమాలు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితులను ఎదుర్కొన్నాయి. దాంతో ఆశ్రమాల నిర్వాహకులు డొనేషన్ల కోసం ఆటో ట్రాలీలను సిటీలో తిప్పుతున్నారు. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులకు సాయం చేయమని కోరుతున్నారు. 

తగ్గిన విజిటర్ సంఖ్య..
గతంలో శని, ఆదివారాల్లో అనాథాశ్రమాలకు దాతలు వచ్చి అన్నదానం చేసేవారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు జరుపుకునేవారు. కొంతమంది డాక్టర్లు, పోలీసులు తమ పిల్లల పుట్టినరోజులు జరపడానికి వెళ్లినప్పుడు అదొక మోటివేషన్ లా ఉండేది. రెండేళ్లుగా హోమ్స్ లో ఈ తరహా వేడుకలు తగ్గిపోయాయి. కరోనా ఎఫెక్ట్​తో ఆ పరిస్థితులే కనిపించడం లేదు. కొన్ని ఆశ్రమాలు నేరుగా విజిటర్స్ అనుమతించడం లేదు. అనుమతిస్తున్న చోటుకు వెళ్లేందుకు విజిటర్స్ ఆసక్తి చూపించడంలేదు. తమ వల్ల పిల్లలు, వృద్ధులకు వైరస్ సోకుందని కొందరు, హోమ్స్​లోని వాళ్ల వల్ల తమకు ఆరోగ్య సమస్యలు రావొచ్చని మరికొందరు ఆలోచిస్తున్నారు.

డొనేషన్స్​ రావట్లే.. మేమే వెళ్తున్నం
మేం 10 నెలల క్రితం ‘వాక్ ఫర్ హోం లెస్’ అనే సంస్థని స్టార్ట్ చేశాం. లాక్ డౌన్ లో చాలామంది వృద్ధులు ఒంటరివాళ్లయ్యారు. వారిలో పిల్లలు వదిలేసినవాళ్లు, పిల్లలు లేనివారు ఉన్నారు. అలాంటి వారికోసమే మా హోం. ప్రస్తుతం 50 మంది వృద్ధులున్నారు. విరాళాలు పెద్దగా రావట్లేదు. కరోనా నేపథ్యంలో దాతలు ఆశ్రమాలకు వచ్చేందుకు ఇంట్రస్ట్​చూపించట్లేదు. డొనేషన్స్​కోసం మేమే ఆటో ట్రాలీలను కాలనీల్లో తిప్పుతున్నాం. దాతలు ఆదుకోవాలని కోరుతున్నాం. కొందరు హోంకు వచ్చి ఫుడ్ పెట్టి వెళ్తున్నారు. మరికొందరు ఆటోల వద్దే బట్టలు, కూరగాయలు, డబ్బు ఇస్తున్నారు.
- రాణి, వాక్ ఫర్ హోం లెస్, హయత్ నగర్