కాలేజీకి పోకుండనే‌‌ కంప్లీటైతున్న ఎంబీబీఎస్‌‌

కాలేజీకి పోకుండనే‌‌ కంప్లీటైతున్న ఎంబీబీఎస్‌‌
  • కరోనాతో 2020లో చైనా నుంచి వచ్చిన మెడికోలు   
  • మూడేండ్లుగా ఆన్‌‌లైన్‌‌లోనే క్లాసులు, పరీక్షలు
  • అక్కడ మళ్లీ కరోనా ఉండటంతో ఇంకో ఏడాది ఇక్కడే ఉండక తప్పేలాలేదు 

హైదరాబాద్, వెలుగు:చైనాలో మెడిసిన్ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్ల పాలిట కరోనా పెనుశాపంగా మారింది. కరోనా విజృంభించడంతో 2020 మొదట్లోనే అక్కడ చదువుతున్న వాళ్లంతా ఇండియాకు తిరిగొచ్చేశారు. ఈ మూడేండ్లలో కరోనా వస్తూ పోతూ జనాలను తిప్పలు పెడుతూనే ఉంది. ఇతర దేశాలన్నీ నిబంధనలు సడలించి స్టూడెంట్లకు వీసాలు ఇచ్చినా, చైనా మాత్రం మొండిగా వ్యవహరించింది. ఇండియన్, ఇతర దేశాల స్టూడెంట్లను తిరిగి చైనాలోకి వచ్చేందుకు అనుమతించలేదు. మన దేశం నుంచి 23 వేల మంది స్టూడెంట్లు చైనా యూనివర్సిటీల్లో రిజిస్టర్ చేసుకుని ఉండగా, ఇందులో18 వేల మంది మెడిసిన్ స్టూడెంట్లు ఉన్నారని అప్పట్లోనే చైనాలోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. వీళ్లంతా 2020 నుంచి ఇండియాలోనే ఉండిపోయారు. జీరో కొవిడ్ పాలసీ పేరిట చైనా ఎవ్వరినీ తమ దేశంలోకి రానివ్వలేదు. స్టూడెంట్ల విషయంలో సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేయడంతో, గతేడాది ఆగస్ట్‌‌‌‌లో స్టూడెంట్ వీసాల విషయంలో సడలింపులు ఇస్తామని ప్రకటించింది. దశలవారీగా స్టూడెంట్లను అనుమతిస్తామని పేర్కొంది. దీంతో మన దేశం నుంచి సుమారు 400 మంది స్టూడెంట్లు తిరిగి చైనాకు వెళ్లారు. ఈలోపు మళ్లీ అక్కడ కరోనా విజృంభించడంతో మిగిలిన స్టూడెంట్లు ఇక్కడే ఆగిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లేందుకు స్టూడెంట్లు, వారిని పంపించడానికి పేరెంట్స్ భయపడుతున్నారు. చైనా కూడా వీసాలు ఇవ్వడం మళ్లీ ఆపేసింది. ఇప్పటికే మూడేండ్ల నుంచి ఇక్కడున్న మెడికోలు, ఇంకో ఏడాది ఇక్కడే ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికోల దుస్థితి కూడా ఇలాగే ఉంది. వాళ్లూ ఇక్కడ్నుంచే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పాఠాలు వింటూ, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. 

చైనా చదువులు నాసిరకమే  

ఎన్‌‌‌‌ఎంసీ నిబంధనల ప్రకారం విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసిన స్టూడెంట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్‌‌‌‌ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్‌‌‌‌(ఎఫ్​ఎంజీఈ) పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌‌‌‌ పాసయ్యాక, ఇక్కడే ఏడాది పాటు ఇంటర్న్‌‌‌‌షిప్ చేయాలి. ఆ తర్వాతే డాక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. అసలు ఏ మాత్రం క్లినికల్ నాలెడ్జ్ లేని మెడికోలు ఈ ఎగ్జామ్‌‌‌‌లో పాసవడం అసాధ్యం అని మెడికల్ ఎక్స్‌‌‌‌పర్ట్స్ చెప్తున్నారు. దీనిపై ఎన్‌‌‌‌ఎంసీ కూడా ఇటీవల ఓ నోట్ విడుదల చేసింది. చైనాలో మెడిసిన్ చేసిన ఇండియన్ స్టూడెంట్లు ఎఫ్‌‌‌‌ఎంజీ ఎగ్జామ్ పాస్ కావట్లేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. 2015 నుంచి 2021 దాకా చైనాలో చదివిన 40,417 మంది మెడికోలు ఎఫ్‌‌‌‌ఎంజీ ఎగ్జామ్‌‌‌‌ రాయగా, అందులో 6,387(15.8%) మంది మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేయగలిగారని ఎన్‌‌‌‌ఎంసీ వెల్లడించింది. వీళ్లలో చాలా తక్కువ మంది మొదటి, రెండో అటెంప్ట్‌‌‌‌లో పాస్ అయ్యారు. మెజారిటీ స్టూడెంట్లు నాలుగైదు సార్లు రాస్తే తప్ప పాస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైనాలోని వర్సిటీల్లో చేరినోళ్లను తప్ప, కొత్తగా ఎవరినీ అక్కడికి పంపించొద్దని పరోక్షంగా తల్లిదండ్రులకు ఎన్‌‌‌‌ఎంసీ సూచించింది.

పుట్టెడు కష్టాలు  

మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసి డాక్టర్ అవడానికి థియరీ క్లాసుల కంటే, ప్రాక్టికల్, క్లినికల్ నాలెడ్జ్‌‌‌‌ ఎంతో ముఖ్యం. కానీ, చైనా ఆంక్షలతో మూడేండ్ల నుంచి మెడికోలు ఇక్కడే ఉండిపోయారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే పాఠాలు వింటున్నారు. ఎగ్జామ్స్ కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే రాస్తున్నారు. ఎగ్జామ్‌‌‌‌ రాసిన వాళ్లలో 95 శాతం మందిని పై క్లాస్ లకు ప్రమోట్ చేస్తున్నారు. సర్టిఫికెట్లు కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే పంపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో తిరిగొచ్చిన స్టూడెంట్లు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌‌‌‌‌‌‌‌, ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌ లెవల్‌‌‌‌కు వచ్చారు. కానీ, వాళ్లకు కనీసం ఇంజక్షన్ ఇవ్వడం కూడా రాదు. క్లినికల్ నాలెడ్జ్‌‌‌‌ దాదాపు జీరో అనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో తాము డాక్టర్లు అవ్వడం ఎలా? అని స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రాసిన ఎగ్జామ్స్‌‌‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌‌‌‌ఎంసీ) ఒప్పుకుంటుందా, లేదా అన్నదీ సందేహంగానే ఉంది. ఒకవేళ మళ్లీ ఎక్కడ ఆపేశారో, అక్కడి నుంచి మొదలు పెట్టాల్సి వస్తే ఒక్కో స్టూడెంట్ మూడు నుంచి నాలుగేండ్లు అదనంగా చదవాల్సి వస్తుంది. ఇందుకోసం చైనా వర్సిటీలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో ఆర్థిక భారం కూడా మోయక తప్పదు.