ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
  • ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కరోనా
  • బెజవాడలో శని,ఆదివారాల్లో వ్యాపార సంస్థల స్వచ్ఛంద బంద్ 

అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా కలకలం రేగింది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయింది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన పద్మారావు కరోనాతో మృతి చెందడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల్లో భయాందోళన తొలగించేందుకు నిన్న సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు జరిపింది. ఫలితాలు రావాల్సి ఉండగా.. ఉద్యోగులు వర్కు ఫ్రమ్ హోం నిర్వహించేలా అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.

బెజవాడలో శని,ఆదివారాల్లో వ్యాపార సంస్థల స్వచ్ఛంద బంద్ 

కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో వ్యాపార సంస్థలు ముఖ్యంగా షాపింగ్ మాల్స్ నిర్వహణపై భయాందోళనలు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండగా.. పనిచేసే సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బెజవాడ నగరంతోపాటు శివార్లలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో శని,ఆదివారాల్లో రెండు రోజులపాటు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు, మాల్స్  తెరిచి ఉంచాలని తీర్మానించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి వ్యాపార సంస్థ యజమాని, సిబ్బంది, కుటుంబ సభ్యులు విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించడంతోపాటు పక్కాగా శానిటేషన్ చర్యలు చేపట్టాలని కోరారు.