చివరి చూపు చూడనివ్వరూ..

చివరి చూపు చూడనివ్వరూ..

కరోనా పేషెంట్ల ఫ్యామిలీస్ డిమాండ్

సేఫ్టీ ప్రికాషన్స్ తో అనుమతిస్తున్న ఆస్పత్రులు

ఇజ్రాయెల్: ఇజ్రాయిల్ లోని ఓ ఆస్పత్రి. కరోనా వైరస్ బారిన పడి చావుబతుకుల్లో ఒక పేషెంట్. పేరు సింహా బెన్ షాయ్ (75). అతడి కూతురు ఎలిషెవా స్టెర్న్. తండ్రికి ఎలాగైనా తుది వీడ్కోలు చెప్పాలని ఎలిషెవా స్టెర్న్ కోరిక. అందుకు అనుమతించాలని డాక్టర్లను వేడుకుంది. వారు సరేననడంతో ఎలిషెవా వైరస్ వార్డులోకి వెళ్లింది. ధారగా కారుతున్న కన్నీళ్ల మధ్యే బెన్ షాయ్ పక్కన కూర్చుంది. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఆయనతో గడిపానన్న సంతృప్తి మధ్యే తండ్రికి గుడ్ బై చెప్పింది. కరోనా మహమ్మారి కోరలు చాచి ప్రాణాలను హరిస్తున్న వేళ.. ఎలిషెవాలా తమకూ ఆప్తులను చివరిసారి చూడటానికి అవకాశమివ్వాలని ప్రపంచవ్యవాప్తంగా చాలా మంది పేషెంట్ల కుటుంబీకులు, బంధువులు ప్రాథేయపడుతున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రులు ప్రికాషన్స్ తీసుకొని వారిని అనుమతిస్తున్నాయి.

కడసారి మాట్లాడటం సంతోషం
ప్రేమించే వారికి వీడ్కోలు చెప్పడానికి ఎవరూ సిద్ధంగా ఉండరని ఇరాన్ కు చెందిన ఎలిషెవా స్టెర్న్ చెప్పింది. అదృష్టవశాత్తూ తన నాన్నతో కడసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఆయనతో సారీ నాన్నా, లవ్ యూ అని చెప్పానని చెమ్మగిల్లిన కళ్లతో ఎలిషెవా పేర్కొంది.

ఇది మా నైతిక విధి
ఒంటరిగా చనిపోతున్న రోగుల గురించి వింటుంటే బాధాకరంగా ఉందని రోనీ గమ్జూ అనే డాక్టర్ చెప్పారు. ఏ ఒక్కరూ ఒంటరిగా చనిపోకుండా చూడటం మెడికల్ స్టాఫ్ గా, మనుషులుగా తమ నైతిక విధి అని రోనీ పేర్కొన్నారు. మాస్క్, క్యాప్, రోబ్, గ్లోవ్స్, బూట్లతోపాటు హెడ్ ప్రొటెక్టివ్ వేర్ తో 15 నిమిషాల పాటు తుది వీడ్కోలు చెప్పడానికి పేషెంట్ల కుటుంబీకులను అనుమతిస్తున్నామని వివరించారు.

హెల్త్ కేర్ డైలమా
‘తమ వాళ్లను చివరిసారి చూడనివ్వాలని పేషెంట్ ఫ్యామిలీస్ ప్రాథేయ పడుతున్నాయి. సాధారణ సమయాల్లో ఇది మామూలు రిక్వెస్ట్ లా అనిపించినా.. ప్రస్తుత టైమ్ లో నైతికతతోపాటు హెల్త్ కేర్ డైలమాగా మారిందని’ డెట్రాయిట్ లోని ఓ మెడికల్ గ్రూప్ పేర్కొంది.