
హైదరాబాద్, పద్మారావునగర్, వెలుగు: కరోనా వైరస్ కలవరపెడుతోంది. చైనాలోని వూహాన్ నుంచి వచ్చిన ఓ కేరళ స్టూడెంట్‌కు వైరస్ కన్ఫర్మ్ కావడంతో రాష్ర్ట ప్రభుత్వం అలర్ట్ అయింది. చైనా నుంచి వచ్చిన వాళ్లందరినీ అబ్జర్వేషన్‌లో ఉంచాలని హెల్త్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది. హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో 24 గంటల హెల్ప్‌లైన్ సెంటర్‌ను ప్రారంభించింది. చైనా ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లకు జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 040 24651119కు కాల్ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం సాయంత్రానికల్లా గాంధీ హాస్పిటల్‌కు కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లు వచ్చే అవకాశముందని ‘వెలుగు’కు వివరించారు. గాంధీలో ఉన్న మైక్రోబయాలజీ ల్యాబ్‌లో అనుమానితులకు కరోనా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా టెస్టింగ్ ఫెసిలిటీ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది.
నూరు బెడ్లతో ఐసోలేటెడ్ వార్డు
హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి దవాఖానలో నూరు బెడ్లతో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. జనవరిలో చైనా నుంచి వచ్చిన వాళ్లంతా రెండు వారాలపాటు స్వతహాగా క్వారంటైన్(రోగం ఉందేమో అనే అనుమానంతో కొత్తగా వచ్చిన వారిని వేరుగా ఉంచడం)లో ఉండాలని, ఇతరులతో కాంటాక్ట్ పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తమను సంప్రదిస్తే సరోజిని దేవి ఆస్పత్రిలో ఏర్పాటు చేయబోయే ఐసోలేటెడ్ వార్డులో ఉంచి, అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం గాంధీ, ఫీవర్, చెస్ట్ హాస్పిటల్స్‌లో మాత్రమే ఐసోలేషన్ వార్డులున్నాయి.
గాంధీలో ఒకరు, ఫీవర్ ఆస్పత్రిలో ఇంకొకరు
గురువారం గాంధీ హాస్పిటల్లో ఒకరు, ఫీవర్ ఆస్పత్రిలో ఇంకొకరు అడ్మిట్ అయ్యారు. ఈ ఇద్దరూ ఈ మధ్య చైనాకు వెళ్లి రావడం, జలుబు, జ్వరం ఉండటంతో డాక్టర్లను సంప్రదించారు. దీంతో వీరిని ఐసోలేషన్ వార్డుల్లో అబ్జర్వేషన్‌లో ఉంచామని, శాంపిల్స్ సేకరించి పుణేకు పంపించామని ఆఫీసర్లు తెలిపారు. ఇద్దరిలో ఒకరికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. బుధవారం పంపిన 7 శాంపిల్స్‌తో కలిపి మొత్తం 9 మందికి సంబంధించిన రిజల్ట్స్ రావాల్సి ఉందని నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే రిజల్ట్ రాకముందే అనుమానితులను ఇంటికి పంపించారు. ఒకే కుటుంబానికి చెందిన వీళ్లు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటామని రిక్వెస్ట్ చేయడంతో పంపినట్టు అధికారులు తెలిపారు. వీళ్ల కదలికలను అబ్జర్వ్ చేయాలని సంబంధిత డీఎంహెచ్‌వోను ఆదేశించారు.
గాంధీలో క్రిటికల్ కేర్ యూనిట్
ప్రస్తుతానికి రాష్ర్టంలో ఎవరికీ కరోనా కన్ఫర్మ్ కాలేదు. ఎవరికైనా వైరస్ సోకితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో.. గాంధీలో క్రిటికల్ కేర్ యూనిట్‌ను సిద్ధంగా ఉంచాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను స్పెషల్ సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. స్టేట్, డిస్ర్టిక్ లెవల్‌లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను యాక్టివేట్ చేయాలని సూచించారు. 15 వేల ఎన్95 టైప్ మాస్కులు, 15 వేల సెన్సిటైజర్లు, 10 వేల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ)ను కొనుగోలు చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరికైనా వైరస్ సోకితే క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఈ వైరస్‌కు ఎట్లాంటి మెడిసిన్ లేదు. స్వైన్ ఫ్లూలాగే, కరోనా కూడా రెస్పిరేటరీ సిస్టమ్‌పై దాడి చేస్తోంది. దీంతో సంబంధిత మెడిసిన్ ఇస్తూ పరిస్థితి విషమించకుండా కాపాడటమే మార్గమని డాక్టర్లు చెబుతున్నారు.