
కరోనా వైరస్ బారినపడి తిరిగి కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరుకుంందని అన్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్న చాలా మంది పేషెంట్లకు వైరస్ ఎలా సోకిందన్న లింక్ తెలియడం లేదని చెప్పారాయన. కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి జరుగుతోందని, దీన్ని టెక్నికల్‌గా లోకల్ స్ప్రెడ్ అని అంటారా లేక కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారా అన్నది కేంద్రం నిర్ణయానికే వదిలేయాలని అన్నారు. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య పది లక్షలకు పైగా దాటిపోతే దానిని ఏమనాలని, ఏ పేషెంట్‌కు వైరస్ ఎలా అంటుకుందో తెలియడం లేదని, ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ కాదా అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రశ్నించారు. ఇటీవలే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందని చెప్పింది. అయితే ఇప్పటికీ దేశంలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (55)కు జూన్ 17న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాహిర్పూర్‌లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్లాస్మా థెరపీ చేయడంతో తిరిగి కోలుకున్నారు సత్యేంద్ర జైన్. జూన్ 26న ఆయన ఆప్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకున్న ఆయన ఇవాళ తిరిగి విధుల్లోకి చేరారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.