కరోనా ఎఫెక్ట్ మహిళల కన్నా మగవాళ్లపైనే ఎక్కువ

కరోనా ఎఫెక్ట్ మహిళల కన్నా మగవాళ్లపైనే ఎక్కువ

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి.. ప్రపంచ దేశాలకు విస్తరించిన ప్రాణాంతక వైరస్ కరోనా ఎఫెక్ట్ మహిళల కన్నా మగవాళ్లపైనే ఎక్కువగా ఉంది. చైనాలో ఇప్పటి వరకు 76 వేల మంది ఈ వైరస్ బారినపడగా.. వారిలో 2345 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వైరస్ సోకిన వారిలో డెత్ రేట్ మగవాళ్లలో 2.8 శాతం, మహిళల్లో 1.7 శాతం ఉన్నట్లు ఆ దేశంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీపీ) తెలిపింది. గతంలో చైనాలో సార్స్, మెర్స్ వైరస్‌లు ప్రబలిన సమయంలో కూడా మృతుల్లో మగవాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆ సంస్థ డేటా చెబుతోంది.

కారణాలు..

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లోవా పరిశోధకులు కరోనాపై చేసిన ప్రయోగాల్లోనూ మగవారికే ఈజీగా వైరస్ సోకే ప్రమాదం ఉందని గుర్తించారు. వారు ఎలుకలపై చేసి పరిశోధనల్లో వైరస్‌ను వాటికి ఎక్కించి అధ్యయనం చేశారు. అయితే మగ ఎలుకపై వైరస్ ప్రభావం వేగంగా కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోందన్నది శాస్త్రీయంగా తేల్చనప్పటికీ రీసెర్స్, డాక్టర్లు, వైద్య రంగ నిపుణులు కొన్ని కారణాలను చెప్పారు.

  • ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లలో పొగతాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోదక వ్యవస్థ బలహీన పడి స్త్రీల కన్నా పురుషులకు త్వరగా కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
  • పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉంటుందని దశాబ్దాలుగా జరిగిన అనేక పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. లేడీస్‌లో రెండూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండడం వల్ల జన్యు పరంగా వారిలో ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
  • చైనాలో మహిళలతో పోలిస్తే షుగర్, బీపీ లాంటి లైఫ్ స్టైల్ జబ్బులతో పోరాడుతున్న మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  • సాధారణంగా మహిళలు జర్వం, జలుబు లాంటి సమస్యలు వచ్చినా వేగంగా డాక్టర్‌ని కలుస్తారని, మగవాళ్లు తగ్గిపోతుందిలే అన్న ధోరణిలో ఆలస్యం చేస్తారని నిపుణులు చెబుతున్నారు. చైనాలోనూ సిప్టమ్స్ తీవ్రమయ్యే వరకు మగవాళ్లు ఆస్పత్రులకు రాకపోవడం వల్ల కరోనా మృతుల్లో వాళ్లే ఎక్కువగా ఉన్నారన్నారు.