
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలన్న దానిపై కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీ సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు కోరారు ప్రధాని మోడీ. ప్రజలు ఒక్కసారిగా మళ్లీ రోడ్లపైకి వచ్చేయకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. లాక్ డౌన్ అమలు, ముగింపు స్ట్రాటజీ సహా పలు అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగిసిన తర్వాత విడతల వారీగా ఆంక్షలు సడలించాలన్న అభిప్రాయాన్ని పలువురు సీఎంలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్న ప్రతిపాదించారని సమాచారం.
రానున్న కొద్ది వారాల సమయం చాలా కీలకం
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అభినందించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై పీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో రానున్న కొద్ది వారాల సమయం చాలా కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాలు టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ పై దృష్టి పెట్టాలని సీఎంలకు సూచించారు. దేశంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసుకోవాలని, కూరగాయలు, నిత్యావసర సరుకుల సరఫరా విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ ఎక్యూప్మెంట్, వాటి తయారీకి అవసరమైన వస్తువుల ట్రాన్స్ పోర్ట్ కు అడ్డంకులు లేకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారని పీఎంవో తెలిపింది. ఢిల్లీ నిజాముద్దీన్ సదస్సు నుంచి తిరిగి వచ్చిన వారిలో ఎక్కువగా కరోనా కేసులు బయటపడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు పలువురు సీఎంలు. అనుమానితుల గుర్తింపు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ చేయడంతో పాటు వైద్య సదుపాయలను అవసరమైన మేర రెడీ చేస్తున్న తీరును వివరించారు.