
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ రూపొందించడంపై చాలా దేశాల్లో పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. పలు సంస్థల వ్యాక్సిన్‌లు క్లినకల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిని పక్కనబెడితే బ్రెజిల్‌లో నిర్వహించిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఓ వాలంటీర్ చనిపోయాడు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కలసి నిర్వహించిన వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఈ విషాదం జరిగింది. బుధవారం ఈ విషయాన్ని బ్రెజిల్ హెల్త్ అథారిటీ వెల్లడించాయి. వాలంటీర్ మృతి చెందినప్పటికీ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్ట్ వ్యాక్సిన్ టెస్టింగ్ పనులు కొనసాగనుండటం గమనార్హం. వాలంటీర్ మృతికి సంబంధించి ఏ వివరాలు బయటకు తెలియరాలేదు. ట్రయల్స్‌లో పాల్గొనే వాలంటీర్ల విషయాలను బయటకు వెల్లడించకూడదు కాబట్టి చనిపోయిన వాలంటీర్‌కు సంబంధించిన వివరాలు తెలియరాలేదని సమాచారం. అయితే దీనిపై విచారణ జరుగుతుందని సావో పాలో ఫెడెరల్ యూనివర్సిటీ స్పష్టం చేసింది.