
- బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆశావహులు
- ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న 19 మంది
- తమకు టికెట్ ఇస్తే గెలుస్తామనే ధీమాలో కార్పొరేటర్లు
హైదరాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ సిటీలోని సెగ్మెంట్లలో పోటీకి కార్పొరేటర్లు కూడా సై అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి పలువురు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు టికెట్లను ఆశించినా సిట్టింగ్‌లనే మరోసారి పార్టీ అధినేత ప్రకటించారు. దీంతో చాలామంది ఆశలు వదులుకున్నారు. అయితే నాంపల్లి, గోషామహల్ లో ఎవరిని ప్రకటించలేదు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ ప్రస్తుతానికి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు.
ఈ మూడింటిలో మల్కాజిగిరి నుంచి అల్వాల్ కార్పొరేటర్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎల్బీనగర్, ఉప్పల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల నుంచి టికెట్లను ఇవ్వాలని నలుగురు అధిష్టానాన్ని వేడుకుంటున్నారు. బీజేపీ నుంచి 15 మంది టికెట్లు అడుగుతుండగా రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, ఉప్పల్, ముషీరాబాద్, మల్కాజిగిరి, గోషామహల్ కార్పొరేటర్లు ఇప్పటికే టికెట్లకు దరఖాస్తులు చేసుకున్నారు.
బీజేపీ నుంచే ఎక్కువగా..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కార్పొరేటర్లు అత్యధికంగా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కొందరు కార్పొరేటర్లు నేరుగా తమకే టికెట్ ఇవ్వాలని అడుగుతుండగా, కొందరు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుతున్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి దరఖాస్తు చేసుకున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒకచోట చాన్స్ ఇవ్వాలని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కోరుతున్నారు. రాజేంద్రనగర్ నుంచి పోటీకి మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అప్లై చేసుకోగా.. ఆయనకే టికెట్ కన్ఫమ్ అయ్యే అవకాశాలున్నాయి.
మలక్ పేట్ నుంచి ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేత, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక, కాచిగూడ కార్పొరేటర్ ఉమారాణి ప్రయత్నిస్తున్నారు. ముషీరాబాద్ నుంచి టికెట్ ఇవ్వాలని Aరాంనగర్ కార్పొరేటర్ రవి చారి, గాంధీ నగర్ కార్పొరేటర్ పావనితో పాటు ఆమె భర్త వినయ్ కోరుతున్నారు. మల్కాజిగిరి నుంచి కార్పొరేటర్ శ్రావణ్, మౌలాలి కార్పొరేటర్ సునీత టికెట్లు ఇవ్వాలంటున్నారు. యాకుత్ పురా నుంచి జియాగూడ కార్పొరేటర్ దర్శన్, కూకట్ పల్లి నుంచి మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ టికెట్ కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి వీరే..
కాంగ్రెస్‌లో ప్రస్తుతం నలుగురు కార్పొరేటర్లు ఉండగా నలుగురు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉప్పల్ నుంచి కార్పొరేటర్ రజిత భర్త పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ శిరీష రెడ్డి భర్త సోమశేఖర్ రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఖైరతాబాద్ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి గెలుపు తనదేనని, ఇప్పుడు తనకు చాన్స్ఇస్తే గెలుస్తానని రాజశేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్లు ఇచ్చినా పూర్తి మద్దతు ఉంటుందని, పార్టీ కోసమే పనిచేస్తామని ఆయా కార్పొరేటర్లు పేర్కొంటున్నారు.
ఒక్క చాన్స్ ప్లీజ్..
కార్పొరేటర్లుగా ప్రజలకు చేరువయ్యామని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుస్తామని అధిష్టానం వద్ద రిక్వెస్ట్ చేస్తున్నారు. టికెట్ ఇస్తే తమ సత్తా ఏంటో నిరూపిస్తామని కార్పొరేటర్లు ధీమాతో ఉన్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లలో కొందరు ఏకంగా ఢిల్లీలో కూడా మంతనాలు జరుపుతున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ఈసారి ఎన్నికలు హోరాహోరీ కానుండగా టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది.
ALSO READ :- కాంగ్రెస్ లిస్టు ఇంకింత లేటు.. బస్సు యాత్ర తర్వాత ప్రకటించే చాన్స్
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 44 సీట్లలో గెలవడంతో పార్టీకి ఊపు వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావహులు కూడా పెరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎల్ బీ నగర్ సెగ్మెంట్లో క్లీన్ స్వీప్ చేయడంతో అక్కడ ఎమ్యెల్యే టికెట్ కోసం పోటీ పెరిగింది. కార్పొరేటర్లలోనే ముగ్గురు టికెట్ ఆశిస్తుండగా మరికొందరు ఉన్నారు. కర్నాటక గెలుపుతో కాంగ్రెస్ జోరందుకుంది. దీంతో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే అధికంగానే ఉంది. ఉన్న నలుగురు కార్పొరేటర్లు టికెట్లు కావాలని కోరుతున్నారు. ఇలా టికెట్ల కోసం కార్పొరేటర్లు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.