సంగారెడ్డి బల్దియాలో రూ.4 కోట్లకు పైనే అవినీతి!

సంగారెడ్డి బల్దియాలో  రూ.4 కోట్లకు పైనే అవినీతి!

సంగారెడ్డి/కంది, వెలుగు : సంగారెడ్డి మున్సిపాలిటీలో డెవలప్​మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్న భాగోతం బయటపడింది. ప్రజా ప్రతినిధులు బినామీల ద్వారా చేస్తున్న పనులకు,  శానిటరీ, ఇంజినీరింగ్ విభాగాల అధికారుల రికార్డలు పొంతన లేకుండా ఉన్నాయి. అధికార పార్టీ అండదండలతో పాలకవర్గంలోని కొందరు సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

రూ.4 కోట్ల పైనే ఫ్రాడ్..

మున్సిపల్ పరిధిలో దాదాపు రూ.4 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. కొత్త బస్టాండ్ పక్కన కల్వకుంట రోడ్ లో డ్రైనేజీ, రోడ్డు డెవలప్ మెంట్ కు సంబంధించి 2017-–18లో రూ.80 లక్షలు, బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్, గ్రీనరీకి సంబంధించి రూ1.2 కోట్లు మంజూరు కాగా, ఆ నిధులను అప్పటినుంచి అలాగే పెండింగ్ లో పెట్టి తాజాగా 6,7 వార్డులలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ అరకొరగా నిర్మించి ఆ బిల్లులను డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బైపాస్ రోడ్డులో రూ.కోటీ 20 లక్షలు, ఇతరత్రా పనులకు మళ్లించి పనులు సరిగ్గా చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రతినెలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ పట్టణ ప్రగతికి సంబంధించి రూ.35 లక్షల స్పెషల్ ఫండ్స్ కూడా వివిధ పనులకు ఖర్చు చేసినట్టు చూపించి బిల్లులు ఎత్తినట్లు తెలుస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ను పండుగ అత్యవసరాలకు వాడుకున్నప్పటికీ తిరిగి ఆ నిధులను అదే అకౌంట్ లో జమ చేయాలని  నిబంధనల్లో ఉన్నాయి. కానీ అలా చేయకుండా మున్సిపాలిటీ పరిధిలో చెల్లించాల్సిన కరెంట్ బిల్లు నెలకు రూ.24 లక్షలు ఆ ఫండ్స్ నుంచే చెల్లిస్తున్నారు.  బొబ్బిలికుంట డెవలప్​మెంట్ కు సంబంధించి మున్సిపాలిటీలో రూ.15 లక్షలకు తీర్మానం చేసినప్పటికీ రెండు రోజులు జేసీబీతో పని మమ అనిపించి రూ.8 లక్షల పనులకు బిల్లు డ్రా చేశారు. బ్యాలెన్స్ రూ.7 లక్షల బిల్లు డ్రా చేసేందుకు ప్రయత్నించగా స్థానికంగా న్యూసెన్స్ కావడంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. 

సెంట్రల్ లైటింగ్ ఎక్కడ?

సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్డులో నిర్మించినట్టు చూపిస్తున్న డ్రైనేజీలు, సెంట్రల్ మీడియన్ నిర్మాణం, లైటింగ్ లు కనిపిస్తలేవు. ఆయా పనులకు రు.69.29 లక్షలు ఖర్చు అవుతున్నట్టు అంచనాలు తయారు చేసి తర్వాత పనులు చేసినట్టు బిల్లులు కూడా డ్రా చేశారు. పట్టణంలో వెడల్పు రోడ్లలో కల్వకుంట రోడ్డు ఒకటి. ఈ రోడ్డు మార్గం 65వ నేషనల్ హైవే కంది వరకు వెళ్తుంది. 24 గంటలు రద్దీ ఉంటుంది. ఇలాంటి పెద్ద రోడ్డులో పనులు చేయకుండానే చేసినట్టు చూపించడం పట్ల పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  ఉన్నతాధికారులు స్పందించి నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని, అవనీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కొంత పేమెంట్​ చేశాం 

బొబ్బిలి కుంట పూడికతీత పనులపై శానిటరీ విభాగం ఇచ్చిన నివేదిక మేరకు పనులు పూర్తి కాకపోవడంతో చేసిన పనులకు కొంత పేమెంట్ చేశాం. కల్వకుంట రోడ్డులో సెంట్రల్ మీడియన్, లైటింగ్ పనులు నా హయాంలో జరగలేదు. ఈ విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అక్కడకు వెళ్లి చూశా. సెంట్రల్ మీడియన్ పనులు జరగలేదన్నది వాస్తవమే. 

- ఇంతియాజ్ అహ్మద్,  డీఈఈ, సంగారెడ్డి మున్సిపాలిటీ