ధరణి లో జోరుగా అవినీతి దందా

ధరణి లో జోరుగా అవినీతి దందా

ధరణిలో ప్రొహిబిటెడ్​ లిస్టులో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయి. ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్​చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారు. ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్‌‌, దేవాదాయ, అసైన్డ్​ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే  పనైపోతున్నది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతోంది.

హైదరాబాద్​, వెలుగు: ధరణిలో ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయి. ధర కోట్ల రూపాయల్లో ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్​చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారు. అదీ ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్‌‌, దేవాదాయ, అసైన్డ్​ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే చాలు.. పనైపోతుంది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతూ వస్తోంది. గత వారం నుంచి ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములపై హైదరాబాద్​ సీసీఎల్ఏ ఆఫీసులో స్పెషల్​ మీటింగులు పెడుతూ ఆ లిస్ట్​లో నుంచి కొన్నింటిని తీసేస్తున్నారు. ఇదే అదునుగా అర్హతలేని వాటిని కూడా ఈ జాబితాలో నుంచి తొలగిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యదాద్రి భువనగిరితో పాటు రియల్​ బూం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనూ డబ్బులు తీసుకుని పీవోబీలో ఉన్న సర్వే నంబర్లను తీసేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 10.12 లక్షల సబ్​ డివిజన్​ సర్వే నంబర్లు ప్రొహిబిటెట్  లిస్టులో ఉన్నాయి.

ఎకరాకు 10 లక్షల నుంచి కోటి దాకా

ప్రొహిబిటెడ్​ లిస్టులో ఉన్న సర్వే నంబర్​ తొలగించుకునేందుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. కోటి దాకా కూడా పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం ధర రూ.5 కోట్లు ఉండగా.. ఆ సర్వే నంబర్​ ప్రొహిబిటెడ్​ జాబితాలో ఉంటే దానిని తీయించుకునేందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ముడుపులు తీసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పనిలో పనిగా అసైన్డ్​ ల్యాండ్స్​లో ఉన్నవి, ప్రభుత్వ భూములు వంటి వాటిని కూడా డబ్బులు తీసుకుంటూ నిషేధిత జాబితా నుంచి తీసేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎంసీహెచ్ఆర్డీ దగ్గరలో ఉన్న 50 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తీసేశారు. ఈ ఆర్డర్​ను హైకోర్టు సస్పెండ్​ చేసింది. ఇక జిల్లాల్లో ఒక ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ప్రొహిబిటెడ్​ లిస్ట్ నుంచి సర్వే నంబర్​ తొలగించేందుకు బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికారంలో ఉన్న పెద్దలతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్​ 

నిషేధిత జాబితాలో ఉన్న తమ సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ 1.52 లక్షల అప్లికేషన్లు ధరణిలో నమోదయ్యాయి. వాటిని అన్​బ్లాక్ చేయాలని కోరుతూ సపోర్టింగ్​ డాక్యుమెంట్స్​లో అప్లై చేసుకున్నారు. ఇందులో 1.28 లక్షలు అప్లికేషన్లు డిస్పోజ్​ చేశారు. అయితే డిస్పోజ్​ చేసిన అప్లికేషన్లలో70  శాతం రిజెక్ట్​ చేసినవే ఉన్నాయి. కోర్టు ద్వారా వచ్చిన కొన్నింటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అసలు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే లక్షల సర్వే నంబర్లు, సబ్ డివిజన్లు ప్రొహిబిటెడ్​లో నమోదు కావడంతో వాటిని అవసరానికి అమ్ముకోలేక అర్హులైన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆ జిల్లాల్లోనే ఎక్కువ

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 9,493 గ్రామాల్లో ప్రొహిబిటెడ్​ జాబితాలో సర్వే నంబర్లు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మెదక్​ జిల్లాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల సర్వే నంబర్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో రియల్​ బూం కూడా ఎక్కువగా ఉన్నది. ఇదే అదునుగా భావించి అయిన కాడికి దండుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీస్​లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లు, ఇప్పుడు సీసీఎల్ఏకు వచ్చిన ఈడీఎంలు బేరసారాలు చేసుకుంటూ నిషేధిత జాబితాలో భూములను తొలగిస్తున్నారు. ఈ లిస్ట్​ నుంచి ఎలా బయటపడాలో తెలియని కొందరు పేద రైతులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అప్లికేషన్లు పెట్టుకుంటే రిజెక్ట్​ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.02 లక్షల సబ్​ డివిజన్లు, రంగారెడ్డిలో 78,536, సిద్దిపేటలో 55 వేలు, సూర్యాపేటలో 50,126, నల్లగొండలో 90,105, ఖమ్మంలో 68 వేలు, మెదక్​లో 41,340 సబ్​ డివిజన్​ సర్వే నంబర్లు ప్రొహిబిటెడ్​ లిస్టులో ఉన్నాయి. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గరలో ఒక సర్వే నంబర్​లో 8.20 ఎకరాల భూమి ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉంది. ఇది అసైన్డ్​ ల్యాండ్​గా ప్రొహిబిటెడ్ (నిషేధిత) ​జాబితాలో ఉంది. అక్కడ ఎకరా రూ.3 కోట్లు పలుకుతోంది. దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5  కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. 

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో 14 ఎకరాల భూమి ఒక సర్వే నంబర్ లో ధరణిలో పొరపాటున ప్రొహిబిటెడ్​ లిస్ట్​ నమోదైంది. దీనిని లిస్ట్​లో నుంచి తీపించేందుకు మూడుసార్లు అప్లికేషన్​ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారు. ఇటీవల ఎకరాకు రూ.లక్ష చొప్పున మాట్లాడుకుని ప్రొహిబిటెడ్​ జాబితా నుంచి తీసేశారు.