దివాలా తీసిన రిలయన్స్​ క్యాపిటల్​ను కొనడానికి..

దివాలా తీసిన రిలయన్స్​ క్యాపిటల్​ను కొనడానికి..

ముంబై: దివాలా తీసిన రిలయన్స్​ క్యాపిటల్​ను కొనడానికి కాస్మియా ఫైనాన్షియల్​ హోల్డింగ్స్​రూ. 4,500 కోట్ల ఆఫర్​ను ఇచ్చింది. హిందుజా గ్రూప్​, ఓక్​ట్రీ క్యాపిటల్​, టోరెంట్​ ఇన్వెస్ట్​మెంట్​లు కూడా రిలయన్స్​ క్యాపిటల్​ను కొనాలని చూస్తున్నాయి. రిలయన్స్​ క్యాపిటల్​ జనరల్​ ఇన్సూరెన్స్​ బిజినెస్​ను మాత్రమే కొనడానికి మరో ముగ్గురు బిడ్డర్లూ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

రిలయన్స్​ క్యాపిటల్​ కొనేందుకు రూ. 4,500 కోట్లు చెల్లిస్తానని, ఆ తర్వాత కంపెనీ నిర్వహణ కోసం మరో రూఏ. 1,060 కోట్లను ఇస్తానని కాస్మియా ఆఫర్​ చేస్తోంది. రిలయన్స్​ జనరల్​ ఇన్సూరెన్స్​ను మాత్రమే కొనడానికి మరోవైపు పిరమల్​ నాయకత్వంలోని జూరిచ్​ ఇన్సూరెన్స్​ బిడ్​ ఫైల్​ చేసినట్లు తెలుస్తోంది. కాస్మియా ఫైనాన్షియల్​ హోల్డింగ్స్​ ఫౌండర్​ శామ్​ ఘోష్​ 2017 దాకా రిలయన్స్​ క్యాపిటల్​కు నాయకత్వం వహించారు. రిలయన్స్​ క్యాపిటల్​ను కొనడానికి ఇంకోవైపు హిందుజా గ్రూప్​ రూ. 4,000 కోట్లకు, ఓక్​ట్రీ క్యాపిటల్​ రూ. 4,000 కోట్లకు బిడ్స్​ వేశాయి.

ఇనసాల్వెన్సీ ఎదుర్కొంటున్న రిలయన్స్​ క్యాపిటల్​ను చేజిక్కించుకోవడానికి మొత్తం 14 దాకా బిడ్స్​ వచ్చాయి. రూ. 7 వేల కోట్లతో యాడ్వెంట్​ ఇంటర్నేషనల్​ హైయ్యస్ట్​ బిడ్డర్​గా నిలుస్తోంది. అయితే నాన్​ బైండింగ్​ ఆఫర్లు చివరివరకూ మారే వీలుంటుందని, దీనిని కచ్చితమని పరిగణించలేమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్​ నిప్పన్​ లైఫ్​ఇన్సూరెన్స్​లోని రిలయన్స్​ క్యాపిటల్​ 51 శాతం వాటాకు వేరుగా బిడ్స్​ ఏవీ అడ్మినిస్ట్రేటర్​ వై నాగేశ్వర రావుకు చేరలేదని ఆ వర్గాలు తెలిపాయి.

రిలయన్స్​ నిప్పన్​ లైఫ్​ ఇన్సూరెన్స్​లో జపాన్​ కంపెనీ నిప్పన్​లైఫ్​కు 49 శాతం వాటా ఉంది. ఆథమ్​, యూవీ ఎసెట్​ రికన్​స్ట్రక్షన్​ కంపెనీ, బీ రైట్​ రియల్​ ఎస్టేట్​ వంటి కంపెనీలు కూడా రిలయన్స్​ క్యాపిటల్​ కొనాలని ప్రయత్నిస్తున్నాయి.