 
                                    - తీవ్రంగా దెబ్బతిన్న పత్తి , సోయా పంటలు
- సాధారణ వర్షపాతం కన్నా 35 శాతం ఎక్కువ
ఆదిలాబాద్, వెలుగు : సీజన్ మొదట్లో అధిక వర్షాలు.. చివరిలో అకాల వర్షాలతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆగస్టులో భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలం అయ్యింది. ఫలితంగా వేల ఎకరాల్లో పత్తి, సోయా పంటలు కొట్టుకుపోయి.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం పంట చేతికొస్తున్న సమయంలో మొంథా తూఫాను రూపంలో వానలు రైతులను మరోసారి ముంచేశాయి.
పత్తి పంట చేతికొస్తున్న దశలో వర్షాలు పడటం తో పత్తి పింజలు తడిసిపోతుండగా, మరోపక్క గులాబి పురుగు ఆశిస్తోంది. వర్షాలు, చీడపీడలతో ఒకదిక్కు దిగుబడి తగ్గిపోతుండగా.. మరోదిక్కు మార్కెట్లో రేట్లు గిట్టుబాటు కావడంలేదని అంటున్నారు. ఎకరానికి రూ. 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టగా 5 క్వింటాళ్ల పత్తి కూడా వచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి అయినా తిరిగొచ్చేలా లేదని వాపోతున్నారు.
దిగుబడిపై ప్రభావం
జిల్లాలో ఈ ఏడాది 5.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 4.30 లక్షల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో సోయా, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంటలు మొలక దశలో ఉన్నపుడు మంచి వానలు పడడంతో పంట ఏపుగా పెరిగింది. అంతాబాగుందని సంతోషపడుతుండగా ఆగస్టు రెండో వారంలో కురిసిన జోరు వానలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆగస్టులో జిల్లాలో 12,338 మంది రైతులకు చెందిన 18,310 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. 14,225 ఎకరాల్లో పత్తి, 9,152 ఎకరాల్లో సోయా దెబ్బతిన్నాయి.
దీంతో ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల పరిహారం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో పడిన వర్షాల కారణంగా ఎదిగే దశలో చాలా చోట్ల పత్తి కాయలు మురిగిపోయాయి. పూత సైతం రాలిపోయింది. ఆ వర్షాలతో పత్తి చెట్టు కిందివైపు కాయలు నల్లబారి మురిగిపోయాయి. ఆకులు ఎర్రబారి దిగుబడి దెబ్బతీసింది. మళ్లీ ఇప్పడు పంటల మీద తుఫాన్ ఎఫెక్ట్చూపింది. పొలాల్లోకుప్ప పోసిన సోయా నీటిలో తడిసి మొలకలొస్తున్నాయి.
నిండా ముంచిన మొంథా
ఆసిఫాబాద్/నిర్మల్/బెల్లంపల్లి/దహెగాం: ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పత్తి, వరి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. పత్తి రంగు మారడంతో కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బెల్లంపల్లి మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 150 ఎకరాల్లో వరి పంట నష్టమైంది. పెరికపల్లి, బట్వాన్‌పల్లి, ఆకెనపల్లి గ్రామాల్లో వరి పంట నేలకొరగా, పత్తి పంట తడిసి ముద్దైంది.
పంటల నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని బెల్లంపల్లి ఏవో ఎస్. ప్రేమ్‌కుమార్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన సోయా ధాన్యం తడిసి ముద్దయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వర్షాల వల్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఖానాపూర్ సమీపంలోని తర్లపాడ్ వద్ద బాసర–మంచిర్యాల్ హైవేపై భారీ కల్వర్ట్ ధ్వంసం కాగా, రాకపోకలు నిలిచాయి. మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాధారణం కంటే అధికమే
ఈ ఏడాది జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. జూన్, జూలైలో సాధారణం కన్నా లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు లో భారీ వర్షాలు.. సెప్టెంబర్ లో మోస్తారు వర్షాలు, అక్టోబర్ లో అకాల వర్షాల కారణంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 1067.1 మిల్లీ మీటర్లు కాగా.. 35 శాతం కన్నా ఎక్కువగా 1438.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

 
         
                     
                     
                    