పత్తి సాగు.. కలుపు నివారణ చర్యలు ఇవే...

పత్తి సాగు.. కలుపు నివారణ చర్యలు ఇవే...

 దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగులో మూడవ స్థానంలో ఉంది. లోతైన నల్లరేగడి భూములు పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి గల మధ్యస్థంగా ఉన్న  భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్కా భూములు అనుకూలం కావు. పత్తిలో కలుపు ప్రధాన సమస్య. దీనికి కారణం వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండడం,ఎరువులు అధికంగా వాడడం, వర్షాధారంగా పండించడం వల్ల కలుపు ఎక్కువగా పెరుగుతుంది. కలుపు మొక్కలు పత్తి పంటతో పోటీపడి నీరు, పోషకాలు,వెలుతురు ఉపయోగించుకొని పత్తి మొక్కల ఎదుగుదలను తగ్గిస్తాయి.తద్వారా దిగుబడులు తగ్గుతాయి.

కలుపును నివారించడానికి పత్తి విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% ద్రావకం ( స్టాంప్/ పెండి స్టార్/ ధనుటాప్) కలుపు మందును 1.2 లీటర్లు/ 200 లీటర్ల నీటిలో లేదా పెండిమిథాలిన్ + పైరిథయోబ్యాక్ సోడియం ( మ్యాక్స్ కాట్) 4 మి. లీ/ లీటరు నీటిలో (ఎకరానికి 800 మి.లీ/ 200 లీటర్ల నీటిలో) కలిపి సరైన తేమ ఉన్నప్పుడు భూమిపై పిచికారి చేయాలి. భూమిలో సరైన తేమ లేనప్పుడు పెండిమిథాలిన్ 38.7% ద్రావకం ( స్టాంప్ ఎక్స్ ట్రా / పెండనిల్/ గదర్ మ్యాక్స్) 3.5మి. లీ./ లీటరు నీటిలో (ఎకరానికి 700 మి. లీ./ 200 లీటర్ల నీటిలో) కలిపి భూమిపై పిచికారి చేయాలి. పంట 20 నుంచి-25 రోజుల వయస్సులో ఎక్కువుగా గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటే క్విజాలోఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) 400 మి.లీ లేదా ప్రొపాక్విజాఫాప్ (ఎజిల్) 250మి.లీ. మరియు పైరిథయోబ్యాక్ సోడియం (హిట్ వీడ్, థీమ్, రైఫ్) 250 మి.లీ./ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. రెండు జాతుల కలుపు మొక్కలు ఉంటే పై రెండు మందులను కలిపి పిచికారి చేసుకోవాలి.  వర్షాలు ఎక్కువగా వుండి అంతరకృషి ద్వారా కలుపు నివారణ వీలు కాని పరిస్థితుల్లో లీటరు నీటికి పారాక్వాట్ 5 మి.లీ. లేదా గ్లైఫోసేట్ 10 మి.లీ మరియు 10 గ్రా. యూరియాతో కలిపి పత్తి మొక్కలపై పడకుండా, వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లుగా పిచికారి చేస్తే కలుపు నివారణ బాగా జరుగుతుంది. వరుసల మధ్య దూరం 5 అడుగులు వున్నట్లయితే కుబొటా లాంటి చిన్న ట్రాక్టరుతో అంతర కృషి చేసుకోవచ్చు. కలుపు మందులతో పాటుగా పత్తిలో సమయానుకూలంగా ప్రతీ వారం, పదిరోజులకొకసారి గొర్రు, గుంటకలతో 60 నుంచి-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు, పైరు పెరుగుదల బాగా ఉండి, భూమిలో ఎక్కువ తేమ నిల్వవుండి, తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది.