పవర్​లూమ్స్​పై ‘చేనేత’.. సడుగులిరుగుతున్న సాంచాలు

పవర్​లూమ్స్​పై ‘చేనేత’..  సడుగులిరుగుతున్న సాంచాలు
  • పవర్​లూమ్స్​పై ‘చేనేత’ సడుగులిరుగుతున్న సాంచాలు
  • మరమగ్గాలపై కాటన్​ బట్టల తయారు

రాజన్న సిరిసిల్ల, వెలుగు :   రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత రంగానికి ఫేమస్.  ఇక్కడ ఉత్పత్తి అయ్యే బట్టలను దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తుండేవారు.  చేనేత  రంగానికి మారుపేరుగా నిలిచిన సిరిసిల్లలో మరమగ్గాలు(పవర్​లూమ్స్​) వచ్చి ఆ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి.   మరమగ్గాలపై  చేనేత బట్టలను  నేయవద్దని  రూల్స్​ ఉన్నప్పటికీ  వాటిని పక్కనపెడుతూ కార్మికుల పొట్టకొడుతున్నారు.  సిరిసిల్లలో పలువురు తయారుదారులు  పవర్​లూమ్స్​పై  కాటన్  బట్టలు ఉత్పత్తి  చేస్తున్నారు.   వీటిని మార్కెట్​లో  అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. చేనేత  మగ్గంపై  నేయాల్సిన   బట్టలను మరమగ్గాలపై  నేసి మార్కెట్​లో అమ్మడం 1985  చేనేత చట్టం ప్రకారం నేరం. 

సిరిసిల్లలో ఎన్​ఫోర్స్ మెంట్ దాడులు..

సిరిసిల్లలో పవర్​లూమ్స్​పై  చేనేత కాటన్​ బట్టలు ఉత్పత్తి  చేస్తున్న వారిపై  వారం కింద  చేనేత ఎన్​ఫోర్స్ మెంట్ దాడులు నిర్వహించింది.    నెహ్రూనగర్ కు చెందిన అన్నల్దాస్​ శ్రీనివాస్ తో పాటు  మరికొంత మందిని గుర్తించి కేసులు నమోదు చేసింది.  శ్రీనివాస్ ఉత్పత్తి చేస్తున్న బట్టను  టెస్ట్​ కోసం ల్యాబ్ కు తరలించారు.   చేనేతకు రిజర్వ్ చేయబడిన బట్టలను పవర్​లూమ్స్​పై ఉత్పత్తి చేయడం నేరమని ఇలాంటి ఉత్పత్తులు చేస్తున్నవారిపై  కేసులు నమోదు చేస్తామని చేనేత జౌళి శాఖ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. 

పవర్​లూమ్స్​పై ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారంటే..

చేనేత మగ్గంపై కంటే కరెంట్ తో నడిచే  మరమగ్గాలు ఫాస్ట్ గా బట్టను ఉత్పత్తి  చేస్తాయి.  చేనేత మగ్గంపై ఒక కార్మికుడు  ఒక రోజుకు కేవలం ఐదు మీటర్ల బట్టను మాత్రమే నేస్తాడు.  రోజంతా కష్టపడితే ఐదు మీటర్ల  బట్ట తయారువుతుంది.  అదే కరెంట్​తో నడిచే మరమగ్గాలపై ఒక రోజులో  50 మీటర్ల బట్టను తయారుచేయవచ్చు. చేనేత మగ్గంపై కంటే పవర్​లూమ్​ పై  పదింతలు ఎక్కువగా బట్టలు ఉత్పత్తి అవుతాయి.

169 మగ్గాలే మిగిలినయ్..

రోజురోజుకూ సిరిసిల్లలో  చేనేత పరిశ్రమ మూలకుపడుతోంది.  ఒకప్పుడు 50వేల చేనేత సాంచాలతో కాటన్  బట్టల ఉత్పత్తిలో  పేరుగాంచిన సిరిసిల్లలో మారుతున్న పరిస్థితుల వల్ల కాటన్ బట్టల తయారీ తగ్గిపోతోంది. 50వేల సాంచాల నుంచి కేవలం 169 సాంచాలకు పడిపోయాయి.  అత్యధికంగా ఆర్డర్స్​ వచ్చే బతుకమ్మ చీరలు, ఆర్వీఎం, రంజాన్, క్రిస్మస్​ పండుగలకు ఇచ్చే బట్టలన్నీ పాలిస్టర్ వే కావడంతో కాటన్ బట్టల ఉత్పత్తి వందశాతం తగ్గింది. మగ్గంపై  బట్టనేయడం శ్రమతో  కూడుకున్నది.  27,321 పవర్​లూమ్స్​ ఉంటే వాటిపై పనిచేసే కార్మికులు 10వేల మంది దాకా ఉన్నారు. 169  చేనేత మగ్గాలకు  235 మంది మాత్రమే పనిచేస్తున్నారు.  చేనేత కార్మికుల్లో అత్యధికులు వృద్ధులే.  యువత చేనేతపై ఆసక్తి చూపకపోవడం, చేనేత బట్టల తయారీ  నైపుణ్యాన్ని  నేర్చుకోకపోవడంతో సాంచాలు మూతపడే పరిస్థితి వచ్చింది.

ఏంటీ చేనేత 1985 యాక్ట్..?

చేనేతకు రిజర్వ్ చేయబడిన11  రకాల బట్టలను పవర్​లూమ్స్​పై ఉత్పత్తి చేయకూడదని 1985లో కేంద్ర  చేనేత జౌళిశాఖ  నిషేధం  విధించింది. 1985 యాక్ట్  ప్రకారం కాటన్ ఇండస్ట్రీకి ఇచ్చిన బట్టలను చేనేత మగ్గం ద్వారా మాత్రమే  ఉత్పత్తి  చేయాలి.  పవర్​లూమ్స్​ పై ఉత్పత్తి చేస్తే శిక్షార్హులు.   కాటన్ చీరలు,  దోతీ, టవల్, బూడిదరంగు  డ్రయర్​, లుంగీలు, బెడ్ షీట్స్, బెడ్ కవర్స్, జామాలక్కమ్​, దర్రీ, కాటన్ డ్రెస్ మెటీరియల్స్,  బ్యారక్,  బ్లాంకెట్స్,  కంబలి, శాలువా, లోయర్ మఫ్లర్, ఉన్నీ ట్వీడ్, కాటన్ చద్దర్లను చేనేత మగ్గంపై మాత్రమే ఉత్పత్తి చేయాలని రూల్స్​ విధించింది.  దీని కోసం చట్టం చేసింది.  11  రకాల కాటన్ బట్టలను ఉత్పత్తి చేయొద్దు,  వీటిని చేనేతకు మాత్రమే రిజర్వ్ చేశామని 1996లో ఎస్​వో  557,(ఇ) రద్దు చేస్తూ  ఎస్ వో 2160 ను విడుదల చేసింది.  దీని ప్రకారం కాటన్ బట్టలను ఉత్పత్తి చేయొద్దనే  రూల్స్​ ఉన్నప్పటికీ  జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉత్పత్తిదారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

రూల్స్ పాటించాల్సిందే..

జౌళిశాఖ  రూల్స్​ ప్రతీ ఒక్కరు పాటించాలి.  రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదవుతాయి.  ఈమధ్యనే చేనేత ఎన్​ఫోర్స్ మెంట్  ఆఫీసర్లు దాడులు చేశారు.  చేనేతకు రిజర్వ్ డ్ చేసిన బట్టలను  అక్రమంగా  పవర్​లూమ్స్​ పై  ఉత్పత్తి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.   సిరిసిల్లలో  యువత చేనేత  పనికి ఆసక్తి చూపడం లేదు.  దీంతో కాటన్ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి.  
- సాగర్ , చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, సిరిసిల్ల.