మద్దతు ధర కోసం..ఆదిలాబాద్ లో పత్తి రైతుల ధర్నా

మద్దతు ధర కోసం..ఆదిలాబాద్ లో పత్తి రైతుల ధర్నా
  •     20 శాతం తేమ ఉండడంతో కొనుగోలుకు సీసీఐ నో 
  •     ప్రైవేట్ వ్యాపారులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు సఫలం
  •     తేమ ఎంత ఉన్నా.. రూ.6,950కు కొంటామన్న వ్యాపారులు 

ఆదిలాబాద్, వెలుగు : ఈసారి కూడా పత్తి రైతులకు తొలిరోజే తేమ శాతం కష్టాలు ఎదురయ్యాయి. సోమవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అధికారులు పత్తి కొనుగోలు వేలం నిర్వహించారు. మొదట నాలుగు బండ్లలో పత్తి 12 శాతం కన్నా తక్కువ తేమ ఉండడంతో సీసీఐ కొనుగోలు చేసింది. ఆ తర్వాత బండ్లలో పత్తి తేమ శాతం 15 నుంచి 20 శాతం వరకు రావడంతో సీసీఐ అధికారులు కొనుగోళ్లు ఆపేశారు. 

ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన రూ. 6,950 రేటు తక్కువగా ఉండడం, సీసీఐ కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ధర్నాకు దిగారు. ఇదే సమయంలో మార్కెట్ యార్డుకు వచ్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ ఉన్నతాధికారులను ఫోన్ లో సంప్రదించారు. తేమ 12 శాతం కన్నా ఎక్కువున్నా కొనాలని కోరగా.. సీసీఐ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయలేమని చెప్పడంతో ఆయన వెళ్లిపోయారు. 

దీంతో యార్డు పూర్తిగా పత్తి బండ్లతో నిండిపోయింది. మధ్యాహ్నం ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో ఆందోళన చెందిన రైతులు.. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనాలని అధికారులను పట్టుబట్టారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ రంగంలోకి దిగి.. ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులతో చర్చలు జరిపారు. తేమ శాతంతో సంబంధం లేకుండా క్వింటాల్ రూ. 6950 కు పత్తి కొంటామని ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోళ్లు చేపట్టారు.