పత్తి రైతుకు దక్కని మద్దతు

పత్తి రైతుకు దక్కని మద్దతు
  • పత్తి రైతుకు దక్కని మద్దతు
  • క్వింటాల్​కు రూ.6500 లోపే చెల్లిస్తున్న వ్యాపారులు
  • నెల రోజుల క్రితం రూ.7,300 
  • గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు 
  • తేమ శాతం పేరిట కొర్రీలు
  • ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్న అన్నదాతలు
  • ఇప్పటికే వర్షాలతో దెబ్బతిన్న పంటతో నష్టం 

సిద్దిపేట/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో పత్తికి మద్దతు ధర దక్కడం లేదు. నెల రోజుల క్రితం సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.7300  పలికిన ధర ప్రస్తుతం రూ.6,500కు పడిపోయింది. ఒకవైపు సీసీఐ కేంద్రాలు పనిచేస్తున్నా ఇటీవలి తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరగడంతో రైతులు ఆశించిన మద్దతు ధర లభించడం లేదు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నామని సీసీఐ అధికారులు చెబుతుండడంతో రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.  

నిరుడు ఇదే సమయంలో క్వింటాలు పత్తి ధర రూ.8 వేల రూపాయలు పలుకగా ప్రస్తుతం అనూహ్యంగా ధరలు పడిపోవడం రైతులను కలవరపెడుతోంది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగితే అందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ ఉండడం గమనార్హం. గత సీజన్ లో రికార్డు ధర లభించడంతో ఈసారి కూడా మంచి రేటు లభిస్తుందని భావించిన పత్తి రైతులకు ధరలు తగ్గడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధరను రూ.6,620 నుంచి రూ.7,020 కి పెంచి  మీడియం స్టేపుల్ కు రూ.6,620, రూ.లాంగ్ స్టేపుల్​కు రూ.7,020 గా నిర్ణయించింది. అయితే, అనూహ్యంగా అంతర్జాతీయంగా పత్తి గింజల రేటు పడిపోవడంతో రాష్ట్రంలో దాని ప్రభావం ఉంటోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

తగ్గిన దిగుబడితో ఇబ్బంది

ప్రస్తుత సీజన్ లో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పత్తి దిగుబడి చాలా వరకు పడిపోయింది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుత సీజన్ లో 1.08 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా దాదాపు 80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించారు. సీజన్ ప్రారంభంలో అకాల వర్షాలతో పంటలు నీట మునగడంతో అశించిన రీతిలో పూత రాలేదు. దీనికి తోడు దసరాకు ముందు ఎండల తీవ్రత పెరగడం దిగుబడి పై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల  దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 8 క్వింటాళ్లకు మించడం లేదు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడిని కోల్పోయాడు. వచ్చిన పంటను అమ్ముకోవాలనుకుంటే మార్కెట్లో ధరల తగ్గుదల మూలిగే నక్కపై తాటిపండు  పడ్డ చందంగా మారింది.

వెంటాడుతున్న తేమ తిప్పలు

పండిన పంటను స్థానికంగా అమ్ముకుందామని వెళుతున్న రైతులను తేమ తిప్పలు వెంటాడుతున్నాయి. ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా పత్తి పంటలో తేమ శాతం అధికంగా రావడంతో సీసీఐ కేంద్రాల్లో సైతం నిబంధనల ప్రకారం ధరను నిర్ణయిస్తున్నారు. ఎంతో ఆశతో మద్దతు ధర లభిస్తుందని సీసీఐ కేంద్రాలకు వెళ్తున్న రైతులకు తేమ పేరుతో కొర్రీలు  పెడుతున్నారు. దీంతో పలువురు రైతులు ప్రైవేటు  పర్చేజ్ కు మొగ్గు చూపుతుండటంతో వ్యాపారులకు సానుకూలంగా మారుతోంది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.6,500 మాత్రమే ఇస్తూ డబ్బులను వెంటనే ముట్టచెబుతుండటంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా పత్తి ఏరడానికి కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో డబ్బులు లేక రైతులు తక్కువ ధరకే  పంటను అమ్ముకుంటున్నారు. 

కాగా, గతంలో రోజువారీ కూలికి వచ్చే వారు సైతం పత్తి ఏరినందుకు కిలోకు పది రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. దీంతో కూలి చెల్లింపు కోసం  రైతులకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుండడంతో తక్కువ ధరకైనా పంటను అమ్మేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు మారితే అధిక ధరకు పంటను అమ్ముకోవచ్చనే ఆలోచనలో పలువురు రైతులు ఉన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోనూ అదే పరిస్థితి

ఆదిలాబాద్ జిల్లాలో కూడా పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పడిపోవడంతో పంట అమ్ముకునేందుకు చాలా మంది రైతులు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు తమ అవసరాల కోసం తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. సీసీఐ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్ , జైనథ్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మార్కెట్లో నెల రోజులుగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. 

మద్దతు ధరను సీసీఐ క్వింటాలుకు రూ.7020గా ప్రకటించింది. తేమ శాతం ఎక్కువగా చూపిస్తుండడంతో  పత్తి కొనుగోళ్లకు సీసీఐ వెనుకంజ వేస్తోంది. ఒకవేళ కొనుగోళ్లు జరిపినా ఒక్కో పాయింట్ కు రూ.70 చొప్పున కోత విధిస్తున్నారు. ఇలా అసలు ధర లేకపోగా.. మళ్లీ కోతలు విధించడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్  జిల్లాలో ఈ ఏడాది దాదాపు 3.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటి వరకు 2.50 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. అందులో సీసీఐ 50 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 2 లక్షల క్వింటాళ్లు కొన్నారు. ప్రస్తుతం ప్రైవేట్  వ్యాపారులు క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.6,700 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. 

పోయినేడాది పత్తి ఆరంభంలోనే రూ.9 వేల క్వింటాళ్లతో వ్యాపారులు కొన్నారు. నిరుడితో పోలిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నెల రోజులుగా పంటను ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధర కనీసం రూ.10 వేలు వరకు వస్తేనే అమ్ముకుంటామని చెబుతున్నారు. అయితే పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక.. ఇటు పంటను అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి రూ. 10 వేలు ఖర్చు చేసినా పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాటిండ్ల గ్రామానికి చెందిన రైతు నర్సయ్య నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. వాతావరణంలో మార్పుల వల్ల పంట దిగుబడి తగ్గి ఎకరాకు  గరిష్టంగా  ఎనిమిది క్వింటళ్లు మాత్రమే చేతికొచ్చింది. దీంతో పత్తి ఏరిన కూలీలకు డబ్బులు చెల్లించడానికి రెండెకరాల్లో పండిన పత్తి పంటను అమ్మాలని నర్సయ్య నిర్ణయించుకున్నాడు. ఇటీవల తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి ధర తగ్గింది. పండిన పంటలో కొంత  పంటను అమ్మి కూలీలకు డబ్బులు చెల్లించాడు. మిగిలిన పంటను ధర పెరిగిన తరువాత అమ్ముకోవాలని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది ఒక్క రైతు నర్సయ్య పరిస్థితి కాదు. సిద్దిపేట జిల్లాలో అనేక మంది  పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్య. 

క్వింటాల్​కు రూ.10 వేలు ఇవ్వాలి 

ఈ ఏడాది 25 ఎకరాల్లో పత్తి పంట వేశాను. ఎకరానికి రూ.10 వేలు ఖర్చయింది. ప్రస్తుతం ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఇటీవల కురిసిన వర్షానికి పంట దెబ్బతిన్నది. పంట తడిచిపోయి కాయ కింద నష్టం వాటిల్లింది. పత్తికి కనీస మద్దతు ధర రూ.10 వేలు చెల్లిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. 

- ఇందూరి రాజు రైతు, గిర్నూర్

దిగుబడి తగ్గింది 

నేను ఎనిమిది ఎకరాల్లో పత్తి  పంట సాగు చేశా. నిజానికి 100 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా 40 క్వింటాళ్ల పత్తి మాత్రమే  వచ్చింది. ఇటు దిగుబడి రాక నష్టపోయా. అటు ధర లేక అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి ఆగమాగం అయింది. ప్రభుత్వం వెంటనే పత్తి రైతులకు కనీస గిట్టుబాటు ధర చెల్లించాలి.

- ఖలీమ్, పత్తి రైతు మాదాపూర్ ఇచ్చోడ