వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న పత్తి రైతులు

వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న పత్తి రైతులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో వ్యాపారుల చేతుల్లో పత్తి రైతులు మోసపోతున్నారు. జెండా పాట పేరుతో మద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుందని అధికారులు చెబుతుండగా, తేమ పేరుతో వ్యాపారులు రేటులో కోత విధిస్తున్నారు. కొందరికే క్వింటాకు రూ.7 వేలకు పైగా రేటు చెల్లిస్తూ మిగిలిన వారికి తేమ ఎక్కువ ఉందని చెబుతూ రూ.5 వేలకే కొంటున్నారు. దీంతో దిగుబడి సరిగా లేక బాధపడుతున్న రైతులు కనీసం కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. వర్షాలతో పత్తి తడవడం, నల్లగా మారడం, వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ ఎక్కువగా ఉండడం రైతులకు కష్టంగా మారుతోంది. 

వ్యాపారులదే ఇష్టారాజ్యం..

ఖమ్మం జిల్లాలో ఈసారి 2,21,743 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 1,66,307 మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. సీజన్​ మొదలైనప్పటి నుంచి వర్షాలు కురవడం పత్తి దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరానికి నాలుగు బస్తాల దిగుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు 9,250 బస్తాల పత్తి వచ్చింది. జెండా పాట ధర క్వింటాకు రూ.8019 పలకగా, కనిష్ట ధర రూ.4 వేలు పడింది. యావరేజీగా క్వింటాకు రూ.5 వేలు కూడా దక్కడం లేదని రైతులు చెబుతున్నారు.  పత్తిని ఎండబెట్టి తీసుకొస్తే మంచి రేటు వస్తుందని అధికారులు చెబుతుండగా, రైతులు మాత్రం మాయిశ్చర్​ మిషన్​ లేకుండా వ్యాపారులు చేతులతో పత్తిని పట్టుకొని ధర నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేస్తే మద్దతు ధర అయినా దక్కుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి రూ.6380  మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది జిల్లాలోని 13  జిన్నింగ్​ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్​ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

కూలీ ఖర్చులు రావట్లే..

రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. నాలుగు బస్తాలు మాత్రమే పండింది. మార్కెట్ కు తీసుకు వస్తే రెండు బస్తాలు క్వింటా రూ.6 వేల చొప్పున, మరో రెండు బస్తాలు క్వింటా రూ.5300 చొప్పున కొన్నారు. తేమ ఎక్కువగా ఉందని కొర్రీలు పెడుతున్నారు. పెట్టుబడులు పోను కూలీ ఖర్చులు కూడా రావట్లేదు. -మారుతి వెంకటప్పయ్య, గూడూరుపాడు, ఖమ్మం రూరల్

సీసీఐ ఉంటే మద్దతు ధర దక్కేది..

ఈ ఏడాది ఏడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పండించాను. పది బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. మార్కెట్​లో రూ.5400 చొప్పున కొన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, పత్తి తడిసిందని ధర తగ్గించారు. సీసీఐ కొనుగోలు చేస్తే కనీసం రేటు గిట్టుబాటు అయ్యేది. –బి.రవి, కౌలు రైతు, పైనంపల్ల