- మొదటి రోజు కోసం 325 మంది స్లాట్ బుకింగ్
- 11 కేంద్రాలు ఏర్పాటు
- సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.8,110
- తేమ శాతం 8 నుంచి 12 మధ్య ఉండాలంటున్న అధికారులు
- వర్షాలతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయిన రైతులు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఏటా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండు, మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు, ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడం, గిట్టుబాటు ధర దక్కక, వ్యాపారుల మోసాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే సంప్రదాయ పంటగా పత్తిని సాగు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 4,31,042 కరాల్లో పండించగా.. 33,46,926 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఇప్పటికే కలెక్టర్ రాజర్షి షా పత్తి కొనుగోళ్లకు తేదీ నిర్ణయించారు. సోమవారం నుంచి సీసీఐ పూర్తిస్థాయిలో పత్తి కొనుగోళ్లు చేపట్టనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 కేంద్రాలను ఆదిలాబాద్ ఎ, బి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, సొనాల, పొచ్చర, నేరడిగొండ, నార్నూర్, గుడిహత్నూర్, బేలలో ఏర్పాటు చేశారు. కాగా, సీసీఐ ఈ ఏడాది మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించింది. 8 నుంచి 12 శాతం తేమ కలిగిన నాణ్యమైన పత్తికి కనీస మద్దతు ధర కల్పిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఈసారి పత్తి కొనుగోళ్లను కపాస్ కిసాన్ యాప్ ద్వారా జరపనున్నారు. ఇప్పటికే దీనిపై మార్కెట్ యార్డులో ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. మొదటి రోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కోసం 325 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సీసీఐ ప్రతినిధుల సమక్షంలో వేలం పాట నిర్వహిం చనున్నారు. పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పత్తి కొనుగోళ్లలో రైతుల సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం 7330733421 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
రెండేళ్లుగా తక్కువ వేలం పాట
పత్తి రైతులు ఈ ఏడాది అధిక వర్షాలతో తీవ్ర నష్టాన్ని చూశారు. పంట ఎదిగే దశలో వర్షాలతో14 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఇటు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్ యార్డులో లభించే మద్దతు ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది మద్దతు ధర రూ.7,521 ఉండగా.. ఈ సారి సీసీఐ రూ.8,110 ధర చెల్లించనుంది. అయితే, తేమ శాతం కారణంతో ధరలో కోత విధించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పులతో తేమ శాతం 20 వరకు వస్తోందని రైతులు వాపోతున్నారు.
అటు ప్రైవేట్ వ్యాపారులు వేలం పాటలో పాల్గొని సీసీఐకి మించి ధర పలికితేనే గిట్టుబాటు ధర దక్కనుంది. కానీ, గత మూడేళ్లుగా రైతులకు కనీస మద్దతు ధర అందని ద్రాక్షే అవుతోంది. ఒకప్పుడు క్వింటాల్‌కు రూ.10 వేలతో కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులు రెండేళ్లుగా సీసీఐ కంటే తక్కువ ధరకు వేలం పాడుతున్నారు. దీంతో గతేడాది సగం మంది రైతులు రూ.7 వేలకే పత్తిని విక్రయించాల్సి వచ్చింది. పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ మార్కెటింగ్ ఏడీ గజానంద్ తెలిపారు.
