అసాధ్యమనుకున్నది సాధించారు

అసాధ్యమనుకున్నది సాధించారు
  • ఇండియాలో 99.9 శాతాన్ని మ్యాప్ చేసిన భార్యాభర్తలు
  • తాజాగా రూ. 4,400 కోట్లకు పెరిగిన రాకేష్‌‌‌‌, రష్మీల సంపద

హార్డ్ వర్క్‌‌ ఎప్పటికైనా ఫలితాన్నిస్తుందనడానికి మ్యాప్‌‌మైఇండియా (సీఈ ఇన్ఫోసిస్టమ్స్‌‌) ఫౌండర్లే నిదర్శనం. మంచి శాలరీ ఇచ్చే జాబ్స్‌‌ను వదులుకొని దేశంలో స్టార్టప్ కంపెనీని పెట్టారు రాకేష్‌‌, రష్మీ వెర్మా. గత పాతికేళ్లను దేశంలోని ప్రతి విలేజ్‌‌ను, సిటీని, టౌన్‌‌ను మ్యాప్ చేయడానికి అంకితం ఇచ్చారు. ఇండియాలోని 32,87,263 కిమీల దూరాన్ని మ్యాపింగ్ చేయాలనే టార్గెట్‌కు ప్రతిరూపమే మ్యాప్‌‌మైఇండియా. ఇప్పుడు ఈ కష్టమే ఫలితాన్నిచ్చింది. తాజాగా  ఈ కంపెనీ షేర్లు మార్కెట్‌‌లో బంపర్‌‌ లిస్టింగ్ చేశాయి.  ఈ దంపతుల సంపద రూ. 4,400 కోట్లకు ఎగిసింది.   తాతల వయసులోనూ పనిలో బిజీగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ భార్యాభర్తలు. 

1993 లో  గ్లోబల్‌‌‌‌ కంపెనీ కోకకోలా దేశంలోని థమ్సప్‌ను కొని మరింత విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకుంది. కానీ, ఏయే ఏరియాల్లో బాటిల్‌‌‌‌ తయారీ ప్లాంట్లను పెట్టాలి, ఎక్కడెక్కడ విస్తరించాలనే విషయంలో  ఇబ్బందులు పడింది. కేవలం కోకకోలానే కాదు ఎస్సార్‌‌‌‌‌‌‌‌, సెల్యూలర్ వన్‌‌‌‌కి చెందిన జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌ కంపెనీ సెల్‌‌‌‌టవర్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంలో ఇబ్బందులు పడింది. అప్పటికి1931 నాటి మ్యాపింగ్‌‌‌‌  డిటెయిల్స్‌‌‌‌నే వాడుతుండేవాళ్లు. దీంతో ఈ సెగ్మెంట్‌‌‌‌లో మంచి అవకాశం ఉందని రాకేష్‌, రష్మీలు భావించారు. వెంటనే యూఎస్‌‌‌‌కి చెందిన ఓ కంపెనీ నుంచి  మ్యాపింగ్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌కు లైసెన్స్‌‌‌‌ తీసుకొని  తమ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఎస్సార్‌‌‌‌‌‌‌‌–సెల్యూలర్ వన్‌‌‌‌, కోకకోలా వంటి కంపెనీలతో పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకున్నారు. వీరికి అవసరమయ్యే జియోగ్రాఫికల్ డేటాను అందించారు. మ్యాపింగ్‌‌‌‌లో కూడా డిజిటల్‌‌‌‌ మ్యాపింగ్‌‌‌‌ వైపు అవకాశాలు చూశారు ఈ భార్యాభర్తలు.  

మొదటిలో ఎవరికీ అర్థం కాలేదు..
‘మేము స్టార్ట్ చేసినప్పుడు మ్యాపింగ్ డేటా గురించి ఎవరికీ తెలియదు’ అని లిస్టింగ్ ముందు రోజు రాకేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ప్రస్తుతం, 25 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీస్‌‌‌‌, ప్రభుత్వ కంపెనీలు, మినిస్ట్రీలు మ్యాపింగ్ డేటాను వాడుతున్నాయి’ అని చెప్పారు. మ్యాప్‌‌‌‌మైఇండియాను స్టార్ట్ చేసినప్పుడు దేశంలో ఇంటర్నెట్ యాక్సెస్‌‌‌‌ కూడా సరిగ్గా లేదని గుర్తు చేసుకున్నారు.  కంపెనీ టెక్నాలజీని మెరుగుపరచడంపై రష్మీ పనిచేయగా, క్లయింట్లను సాధించడంపై  రాకేష్ పనిచేశారు. ఇండియాలో చదువు పూర్తి చేసి యూఎస్‌‌‌‌లో సక్సెస్ ఫుల్ కెరీర్స్‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నారు ఈ భార్యాభర్తలు. జనరల్ మోటార్‌‌‌‌‌‌‌‌లో కీలక లెవెల్‌‌‌‌కు రాకేష్ చేరుకోగా, ఇంటర్నేషనల్ బిజినెస్‌‌‌‌ మెషిన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో కంప్యూటర్ డేటాబేస్‌‌‌‌ను రష్మీ నిర్మించారు. ఈ జాబ్స్‌‌‌‌ను వదులుకొని మ్యాప్‌‌‌‌మైఇండియాను స్టార్ట్ చేశారు. కంపెనీని స్టార్ట్ చేసిన మొదటి రెండేళ్లు నరకం చూశామని రష్మీ పేర్కొన్నారు. సర్వేయర్లతో కలిసి రాకేష్‌‌‌‌ ముంబై రోడ్లపైన తిరిగి డేటాను సేకరించేవాడని గుర్తు చేసుకున్నారు. ‘ప్రస్తుతం దేశంలోని 99.9 శాతం అంటే, ప్రతి సిటీ, టౌన్‌‌‌‌, విలేజ్‌‌‌‌ను మ్యాప్ చేశాం’ అని రాకేష్​ గర్వంగా చెబుతున్నారు. 

అంత ఈజీ కాలే..
మొదటిలో ప్రభుత్వం దగ్గర ఉన్న జియోగ్రాఫికల్ డేటాను సేకరించడం ద్వారా తమ బిజినెస్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌ చేయాలనుకున్నారు. కానీ, అధికారుల అలసత్వంతో ఆ పని జరగలేదు. అయినప్పటికీ  దేశంలోని అన్ని ప్రాంతాలను మ్యాపింగ్ చేయడమే తమ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికే అందుబాటులో ఉన్న జియోగ్రాఫికల్ డేటాను సేకరించారు. దీంతో పాటు 400 కు పైగా తమ సర్వేయర్లను పంపి ప్రతి ప్రాంతాన్ని మ్యాప్ చేశారు.  ప్రాంతాలను మ్యాపింగ్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌‌‌‌లు, కొండలు, గుట్టలు, యునిక్ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని మ్యాప్స్‌‌‌‌ రెడీ చేశారు. 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌07 లో  దేశం మొత్తం మీద జీపీఎస్ నేవిగేషన్‌‌‌‌ ను(గూగుల్ మ్యాప్‌‌‌‌ లాంటిది)  లాంచ్ చేశారు. ప్రస్తుతం నావిగేషన్‌‌‌‌లో గూగుల్‌‌‌‌ మ్యాప్‌‌‌‌కు గట్టి పోటీ ఇస్తోంది. మ్యాప్‌‌‌‌మైఇండియా 1.05 కోట్ల యూనిక్‌‌‌‌ డెస్టినేషన్లను  మ్యాప్ చేసింది. 20 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను, 7,068 సిటీలను వీధి స్థాయిలో మ్యాప్‌‌‌‌ చేసింది. 600 కు పైగా విలేజ్‌‌‌‌లను  కూడా కవర్ చేసింది. కేవలం నావిగేషన్‌‌‌‌ సర్వీసులే కాకుండా, వెహికల్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌, ప్రాంతాలను బట్టి ఎనాలసిస్ వంటి సర్వీస్‌‌‌‌లను అందిస్తోంది. కంపెనీ సొంతంగా ఏపీఐ స్టాక్‌‌‌‌ను డెవలప్ చేసుకుంది. ఓఎల్ఎక్స్, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌, ఫోన్‌‌‌‌పే, పేటీఎం వంటి 5 వేల ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ కస్టమర్లు తమ సొంతమని కంపెనీ చెబుతోంది. వెహికల్ తయారీ కంపెనీలూ కంపెనీకి టాప్ క్లయింట్లుగా ఉన్నాయి. నావిగేషన్ యాప్‌ను ఫ్రీగా, డబ్బులకు కస్టమర్లకు అందిస్తోంది.