సిసోడియా సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్

సిసోడియా సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ అధికారులు సిసోడియాను న్యాయమూర్తి జస్టిస్ ఎం. కే. నాగ్పాల్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఆయనను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి అనుమతించాలని అభ్యర్థించారు. మరోవైపు సిసోడియా తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ దయాన్ కృష్ణన్ సీబీఐ కస్టడీ పిటిషన్ను వ్యతిరేకించారు.తన క్లయింట్ విచారణకు సహకరిస్తున్నందున సీబీఐ కస్టడీ అవసరంలేదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు సిసోడియా అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు బీజేపీ ఆఫీసుల ఎదుట ఆందోళన చేపట్టాయి.