ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కోర్టు పరిగణనలోకి ఈడీ చార్జ్​షీట్

ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కోర్టు పరిగణనలోకి ఈడీ చార్జ్​షీట్
  • విచారణ జూన్ 3కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేసులో ఆమె పాత్రపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను రౌస్ ఎవెన్యూ (ట్రయల్) కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అలాగే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత, చణ్​ప్రీత్‌‌‌‌ సింగ్ లకు ప్రొడక్షన్ వారెంట్, మరో ముగ్గురు నిందితులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 3 కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 

ఈ తేదీన కవిత, చణ్ ప్రీత్ సింగ్ లను కోర్టు లో హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించింది. అలాగే దామోదర్‌‌‌‌ శర్మ, ప్రిన్స్‌‌‌‌ కుమార్‌‌‌‌, అరవింద్‌‌‌‌ సింగ్‌‌‌‌లను అరెస్టు చేయకపోవడంతో 3వ తేదీన వీరు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లలో స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 10వ తేదీన కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై దాదాపు 8 వేల పేజీలతో 6వ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (అనుబంధ చార్జ్ షీట్) ను ఈడీ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జ్ షీట్ డాక్యుమెంట్స్ ను ట్రంకు పెట్టలో కోర్టులో సమర్పించింది.

 ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానెల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ లను తాజా చార్జీషీటులో నిందితులుగా పేర్కొంది. ఈ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.కె.మట్ట స్పెషల్ జడ్జి కావేరి బవేజాను కోరారు. కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల ఇన్ టైంలో ఆమె రోల్ పై చార్జ్ షీట్ లో సవివరంగా పొందుపరిచినట్లు తెలిపారు. అయితే.. ఈ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న వాదనలు ముగించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా, తీర్పును బుధవారం(29 వతేది) కి రిజర్వ్ చేశారు. ఈ తాజా ఉత్తర్వుల్లో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.