
కోవాగ్జిన్ పై.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఫైనల్ ఫేజ్ ట్రయల్స్ కొనసాగుతున్నందున నిర్ణయం
రాష్ట్రంలో 20 వేల మందికి కొవాగ్జిన్ టీకా
హైదరాబాద్, వెలుగు: భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకునేటోళ్ల నుంచి రాతపూర్వకంగా కన్సెంట్ తీసుకోవాలని, వాళ్లు అంగీకరించిన తర్వాతే వ్యాక్సిన్ ఇవ్వాలని స్టేట్ హెల్త్ ఆఫీసర్లకు కేంద్రం సూచించినట్టు తెలిసింది. ఫైనల్ ఫేజ్ ట్రయల్స్ కొనసాగుతుండగానే కొవాగ్జిన్ వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూల్స్ ప్రకారం కన్సెంట్ తీసుకోవడం కంపల్సరీ అని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సెంట్రల్ ఆఫీసర్లు తమకు కన్సెంట్ గురించి చెప్పారని, అయితే అందులో ఏముంటుందనే దానిపై ఇప్పటి వరకు తమకు సమాచారం లేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కన్సెంట్‌లో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఉండొచ్చునని ఆయన అంచనా వేశారు. ఏదేమైనా కన్సెంట్‌లో ఉండే విషయాన్ని ముందే వ్యాక్సిన్ వేసుకునేటోళ్లకు వివరిస్తామని, వారి ఇష్ట ప్రకారమే కన్సెంట్ తీసుకుంటామని పేర్కొన్నారు. కన్సెంట్ ఇచ్చినోళ్లకే కొవాగ్జిన్ ఇస్తామన్నారు. భారత్ బయోటెక్ స్టోరేజ్ సెంటర్ నుంచి 20 వేల డోసులు బుధవారం కోఠిలోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ సెంటర్‌కు చేరుకున్నాయి. వీటిని ఏ జిల్లాకు పంపాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు తెలిపారు.
కొవిషీల్డ్‌కు అక్కర్లే…
యూకేలోని ఆక్స్‌ఫర్డ్, ఆస్ర్టాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఫైనల్ ఫేజ్ ట్రయల్స్ అక్కడ పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన డేటాను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీసీజీఐకి అందజేసింది. ఆ వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫికసీ, సైడ్ ఎఫెక్ట్స్ వివరాలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ వేసుకునేటోళ్ల దగ్గరి నుంచి ఎలాంటి కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆఫీసర్లు తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో మన రాష్ర్టంలో దాదాపు అందరికీ కొవిషీల్డ్ వ్యాక్సినే ఇవ్వనున్నారు. ఇందుకోసం 3.64 లక్షల డోసులను కేంద్రం పంపింది. ఫస్ట్ రౌండ్ లో 139 సెంటర్లలో 55,270 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇన్సులేటర్ వెహికల్స్‌లో బుధవారం 30 జిల్లాలకు చెందిన 32,740 డోసులను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని స్టోరేజీ సెంటర్లకు తరలించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సెంటర్లకు సంబంధించిన 22,530 డోసులను హైదరాబాద్ లోనే నిల్వ ఉంచారు. వ్యాక్సినేషన్ స్టార్టయ్యే రోజు పొద్దున సెంటర్లకు తరలించనున్నారు. తొలి రౌండ్‌లో అత్యధికంగా హైదరాబాద్‌లో 18,070 మందికి, అత్యల్పంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 230 మందికి వ్యాక్సిన్ వేస్తారు.
స్పెషల్ కాల్ సెంటర్..
కరోనా వ్యాక్సినేషన్ సమయంలో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌కు తలెత్తే అనుమానాలను తీర్చేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. దీన్ని కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆరుగురు డాక్టర్లు పని చేయనున్నారు. ఒక్కో డాక్టర్ కు 5 జిల్లాలు అప్పగించనున్నారు. అలాగే వ్యాక్సిన్‌పై డౌట్స్ ను క్లియర్ చేసుకునేందుకు లేదా వ్యాక్సిన్ వేసుకున్నాక ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 108, 104 నంబర్లలో సంప్రదించాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ సూచించింది.