ఊబకాయులకు కరోనా రిస్క్‌ ఎక్కువే!

ఊబకాయులకు కరోనా రిస్క్‌ ఎక్కువే!

న్యూఢిల్లీ: బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు లేదా ఊబకాయులకు కరోనా రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని ఇంగ్లండ్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒబెసిటీని తగ్గించడానికి బోరిస్ జాన్సన్ సర్కారు వచ్చే వారం నుంచి కొత్త ప్లాన్‌ను అమలు చేయనుంది. ఊబకాయులకు కరోనా రిస్క్ గురించి పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్‌ఈ) ఓ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఊబకాయులు కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో అడ్మిట్ అవ్వడానికి, చనిపోవడానికి ఎక్కువ చాన్సెస్ ఉన్నాయని హెచ్చరించింది. బాడీ మాస్ ఇండెక్స్‌ (బీఎంఐ) పెరగడం ప్రమాదమని పేర్కొంది. యూకేతో పాటు ఇతర ప్రాంతాల వారికీ ఇది వర్తిస్తుందని పీహెచ్‌ఈ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ఎక్కువ బరువు ఉన్న వారికి కరోనా సోకుతుందని చెప్పలేదు. కానీ డేటా ప్రకారం.. కరోనా వల్ల హెల్తీ బీఎంఐ ఉన్న వారి కంటే ఊబకాయుల ఆరోగ్యం త్వరగా భారీగా క్షీణిస్తుందని అర్థమవుతోంది. అధికారులు చెప్పిన ప్రకారం.. 35 నుంచి 40 బీఎంఐ ఉన్న వారికి వైరస్ వల్ల చనిపోయే అవకాశం 40% పెరుగుతోంది. బీఎంఐ 40కి పైగా ఉన్న వారికి ఈ రిస్క్ 90% ఉంటుంది. వైరస్ వల్ల ఐసీయూల్లో ఉన్న ఆరోగ్యం క్షీణించిన 7.9% మందిలో సాధారణ ప్రజల(2.9%)తో పోల్చుకుంటే బీఎంఐ 40కి పైగా ఉందని మరో డేటా ద్వారా వెల్లడైంది.

‘ఇప్పుడు లభ్యమైన ఆధారం ప్రకారం ఎక్కువ బరువుతో ఉంటే కరోనా వల్ల ఆరోగ్యం క్షీణించడానికి, చనిపోయే రిస్క్ ఉంటుందని స్పష్టమవుతోంది. ఊబకాయులకు కరోనాతోపాటు మరిన్ని ప్రాణాంతక వ్యాధులతో ప్రమాదం ఉంటుంది’ అని పీహెచ్ఈ అలిసన్ టెడ్‌స్టోన్ చెప్పారు. కాగా, ఇంగ్లండ్‌లో ఉన్న పెద్దల్లో 63% మంది ఎక్కువ బరువుతో ఉన్నారు. వీరిలో 55 నుంచి 74 వయస్కుల వారూ ఉన్నారు.