ఫిజిక్స్ టీచర్ లైఫ్ ని మార్చేసిన కొవిడ్

ఫిజిక్స్ టీచర్ లైఫ్ ని మార్చేసిన కొవిడ్

ఎంతోమంది జీవితాలను తారుమారు చేసిన కొవిడ్.. ఫిజిక్స్ టీచర్ రామ్ ప్రసాద్ లైఫ్‌‌ను కూడా మార్చేసింది. క్లాస్ రూంలో ఎప్పుడూ బిజీగా ఉండే రామ్ ప్రసాద్.. లాక్‌‌డౌన్ టైంలో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దాంతో భార్యకు సాయం చేద్దామని కిచెన్‌‌లోకి అడుగుపెట్టాడు. అయితే అప్పుడతనికి తెలియదు కాలక్షేపం కోసం కిచెన్ లోకి వేసిన అడుగు.. ఆయన జీవితాన్ని మలుపు తిప్పుతుందని...రామ్ ప్రసాద్ ఓ మధ్యతరగతి టీచర్. హైదరాబాద్‌‌లో ఫిజిక్స్ ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు చెప్పేవాడు. కొవిడ్ టైంలో ఉద్యోగం పోయి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దాంతో రోజు గడవడం కష్టంగా మారింది. జీతం లేకపోతే జీవితం ఎలా తలకిందులవుతుందో అప్పుడే అర్థమైంది అతనికి. అలా మొదటిసారి పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలిసిన వాళ్ల సాయంతో కొంతకాలం కుటుంబాన్ని వెళ్లదీశాడు. కొన్ని రోజులు ఆన్‌‌లైన్‌‌లో ట్యూషన్లు చెప్పాడు. ఎన్ని చేసినా కుటుంబానికి సరిపడా ఆదాయం దొరకట్లేదు. పాఠాలు చెప్పడం తప్ప మరో పని తెలియని రామ్ ప్రసాద్‌‌కు ఏం చేయాలో తెలియలేదు. సరిగ్గా అప్పుడే ఆయన కూతురు“నాన్నా నువ్వు చేసే చికెన్ 65, చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది”  అన్న మాటలు గుర్తొచ్చాయి . దాంతో బిర్యానీపై ఫోకస్ పెట్టాడు రామ్‌‌ప్రసాద్.

ఏడాది పాటు నేర్చుకుని..

హోటల్ మేనేజ్‌‌మెంట్ చదువుతున్న రెండో కొడుకు “ ప్రాక్టికల్స్ సరిగ్గా జరగట్లేదు” అనడంతో “మనమే ప్రాక్టికల్స్ చేద్దాం” అని ఇంట్లో వంట చేయడం మొదలు పెట్టాడు రామ్‌‌ప్రసాద్. రకరకాల యూట్యూబ్ ఛానెళ్లు చూస్తూ, తెలిసిన వాళ్లందరినీ అడుగుతూ ఏడాది పాటు ఇంట్లోనే బిర్యానీ చేయడం ప్రాక్టీస్ చేశాడు. అలా బిర్యానీ చేయడంలో పూర్తి పట్టు సాధించాడు. సరిగ్గా అదే టైంకి లాక్‌‌డౌన్ కూడా పూర్తిగా ఎత్తేశారు. అప్పుడే రామ్ ప్రసాద్‌‌కు ‘బిర్యానీ బిజినెస్ మొదలు పెడితే ఎలా ఉంటుంది’ అనిపించింది. ముందుగా సికింద్రాబాద్​ లాలాపేట బ్రిడ్జి దగ్గర రోడ్డుపై ఒక బిర్యానీ స్టాల్ పెట్టి చూశాడు. జనాలు బయట తిండిని చూసి భయపడుతున్న రోజులవి. దాంతో ఇది కుదిరే పని కాదనుకున్నాడు. తర్వాత తార్నాకలో పెట్టాడు.  అక్కడా అదే పరిస్థితి. ఇక లాభం లేదని మళ్లీ టీచర్ జాబ్ కోసం ట్రై చేశాడు. కానీ ఏ స్కూల్‌‌లో అడిగినా సగం శాలరీ మాత్రమే ఇస్తామన్నారు.  దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డాడు రామ్ ప్రసాద్. ఇంట్లో వాళ్లు ఫుడ్ బిజినెస్‌‌కే ఓటు వేయడంతో మరోసారి గరిటె పట్టాడు. 

టీచర్స్ బిర్యానీ

రెండు ప్రయత్నాల తర్వాత మూడోసారి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు రామ్ ప్రసాద్. ఈసారి రోడ్డుపై కాకుండా లక్డీకపూల్ మెట్రోకి దగ్గరలో మెయిన్ రోడ్ పక్కన ప్లేస్ కిరాయికి తీసుకున్నాడు. అక్కడ కొన్ని కుర్చీలు వేసి, ‘టీచర్స్ బిర్యానీ’ అనే బోర్డు పెట్టి, బిర్యానీ స్టాల్ ఓపెన్ చేశాడు.  సింగిల్ చికెన్ ధమ్ బిర్యానీ ధర రూ.110, ఫుల్ బిర్యానీ ధర రూ. 230 పెట్టాడు. నెలరోజుల పాటు బిజినెస్ అంతగా జరగలేదు. కానీ, ఒకసారి తిన్నవాళ్లు మళ్లీ రావడం గమనించాడు రామ్ ప్రసాద్. దాంతో కాస్త ధైర్యం వచ్చింది. బిర్యానీ తయారీలో మరిన్ని మెళకువలు నేర్చుకుని బిజినెస్‌‌ను  కంటిన్యూ చేశాడు. అంతే.. రెండు మూడు నెలల్లోనే ఆ ఏరియా అంతటా ‘టీచర్స్ బిర్యానీ’ పేరు పాపులర్ అయింది. ఎంతోమంది టీచర్లు, డాక్టర్లు, యూత్.. ఇలా అందరికీ టీచర్ చేతి బిర్యానీ నచ్చింది. అలా రామ్ ప్రసాద్.. టీచర్ నుంచి చెఫ్‌‌గా మారాడు. ‘ఒక టీచర్‌‌‌‌గా ఎంత శ్రద్ధతో పనిచేస్తానో.. అంతే శ్రద్ధతో బిర్యానీ కూడా తయారు చేస్తున్నా’ అని చెప్తున్నాడు రామ్‌‌ప్రసాద్.

కమిట్‌‌మెంట్ ముఖ్యం

“కొవిడ్ టైంలో ఉద్యోగం లేనప్పుడు ఎంతో భయమేసింది. ఆరుగురు ఉన్న మా కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. జీవితంలో అలాంటి రోజులు వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. సడెన్‌‌గా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియలేదు. కానీ, భయపడకుండా ధైర్యంగా ఉన్నా. అన్నీ అవే సర్దుకుంటాయి అనుకున్నా.  భార్యకు సాయం చేయడం కోసం సరదాగా వంట చేయడం మొదలుపెట్టా. ఉల్లిపాయలు తరగడం నుంచి మసాలాలు నూరడం వరకూ అన్నీ నేర్చుకున్నా. యూట్యూబ్‌‌లో చూసి ప్రొఫెషనల్ చెఫ్‌‌లు బిర్యానీ ఎలా చేస్తారో నేర్చుకున్నా. అలా ఏడాది పాటు బిర్యానీ చేయడం అలవాటు చేసుకున్నా.  లాక్‌‌డౌన్ ఎత్తేశాక బిర్యానీ బిజినెస్ పెట్టాం.  అది బాగా సక్సెస్ అయింది.  ‘టీచర్స్ బిర్యానీ’ అంటే తక్కువ ధరలో దొరికే క్వాలిటీ బిర్యానీగా ఫేమస్ అయింది. బిర్యానీ తయారీ విధానం పూర్తిగా హైజెనిక్‌‌గా ఉండడంతోపాటు బిర్యానీలో వాడే ఐటమ్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడమే అందుకు కారణం. 
టీచర్స్ బిర్యానీ స్టాల్ మా కుటుంబాన్ని ఇబ్బందుల నుంచి బయట పడేసింది. ఇప్పుడంతా బాగుంది.  టీచర్ జాబ్ కంటే ఇందులో సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. రోజూ కొత్త మనుషులు పరిచయం అవుతారు. 

రెగ్యులర్ ఫీడ్‌‌బ్యాక్ వస్తుంటుంది. అయితే చేసే పని ఏదైనా అందులో కమిట్‌‌మెంట్ ముఖ్యం అని నేను నమ్ముతా. సమస్యలు చుట్టుముట్టి నప్పుడు మనో ధైర్యం కోల్పోకుండా ఉండాలని పిల్లలకు చెప్తుంటా.” అని తన ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను షేర్ చేసుకున్నాడు రామ్‌‌ ప్రసాద్.

::: తిలక్​