కడసారి తల్లిని చూడడానికి రాని కూతుళ్లు

కడసారి తల్లిని చూడడానికి రాని కూతుళ్లు

ముగ్గురు కూతుళ్లు, వాళ్ల పిల్లలు, ఊరి నిండా బంధువులు ఉన్న ఓ వృద్ధురాలు కరోనాతో అనాథలా చనిపోయింది. వైరస్​భయంతో కన్నతల్లిని కడసారి దూరం నుంచైనా చూసేందుకు కూతుళ్లు రాని ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలో జరిగింది. గ్రామానికి చెందిన దాసరి అమ్మయి(65) భర్త కొన్నేండ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఊరి నిండా బంధువులు ఉన్నారు. కాగా 15 రోజుల క్రితం పెగడపల్లి మండలంలోని బతికపెల్లిలో ఉంటున్న మూడో కూతురు సువర్ణ ఇంటికి వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లాక అల్లుడు మామిడాల రవికి కరోనా వచ్చింది. ఆయన నుంచి వారి ఫ్యామిలీకి, అమ్మయికి కూడా వైరస్ ​సోకింది. దీంతో సువర్ణ వృద్ధురాలిని ఓ ఆటోలో ఎక్కించి కోటిలింగాలకు పంపించేసింది. ఆటో అతను మూడు రోజుల క్రితం ఇంటి బయట దింపేసి వెళ్లాడు. అప్పటి నుంచి వైరస్​భయంతో ఆమెను పట్టించుకున్నవారు లేకుండా పోయారు. కనీసం తాగడానికి మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయలేదు. కరోనాతోపాటు ఆకలితో అలమటించి మంగళవారం సాయంత్రం మృతి చెందింది. అమ్మయి పడిపోయి ఉండడం గమనించిన స్థానికులు108కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్​ సిబ్బంది వచ్చి చనిపోయిందని నిర్ధారణ చేశారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. బయటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి పూర్తిచేయించారు. భర్త చనిపోయి మూడో కూతురు బాధలో ఉండగా, రెండో కూతురు కడసారి తల్లిని చూసేందు కూడా రాలేదు. పెద్ద కూతురు వచ్చినా దూరం నుంచే చూసింది. కాగా వృద్ధురాలి అల్లుడు మామిడాల రవి(48) కరీంనగర్​లో చికిత్స పొందుతూ మంగళవారమే కరోనాతో చనిపోయాడు.