30 రోజులుగా రికవరీలే ఎక్కువ

30 రోజులుగా రికవరీలే ఎక్కువ


న్యూఢిల్లీ: కరోనా కేసులు ఐదు రోజులుగా లక్ష లోపే నమోదవుతున్నాయి. తాజాగా 84,332 మంది వైరస్ బారిన పడ్డారు. గత 70 రోజుల్లో ఇంత తక్కువ కేసులు
నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య  2,93,59,155కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. 30 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా  ఉన్నాయి. గత 24 గంటల్లో 1,21,311 మంది రికవర్ కాగా, ఇప్పటిదాకా 2,79,11,384 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,002 మంది చనిపోయారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 2,619 మంది, తమిళనాడులో 378 మంది చనిపోయారు. మొత్తం డెత్స్ 3,67,081కి పెరిగాయి.ఇందులో మహారాష్ట్రలో  1,06,367, కర్నాటకలో 32,644, తమిళనాడులో 28,906, ఢిల్లీలో 24,772, యూపీలో 21,667 నమోదయ్యాయి.10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 3.68 శాతమే. రివకరీ రేటు 95.07 శాతానికి పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. 19 రోజులుగా 10 శాతం లోపే నమోదవుతోంది. వీక్లీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. శుక్రవారం ఒక్క రోజే 20,44,131 టెస్టులు చేశారు. 25 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది. 

‘కోల్చిసిన్’ క్లినికల్ ట్రయల్స్​కు ఓకే

కరోనా పేషెంట్లపై కోల్చిసిన్ క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పర్మిషన్ ఇచ్చింది. సీఎస్‌‌‌‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ సలహాదారు రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ..కార్డియాక్ కోమోర్బిడిటీస్ ఉన్న కరోనా రోగులకు కోల్చిసిన్ ఒక ముఖ్యమైన మందు అవుతుందని, వేగంగా కోలుకునేలా చేస్తుందని చెప్పారు. కరోనాసోకినప్పుడు, పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ సమయంలో గుండె సమస్యలు తలెత్తడం వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని ప్రపంచంలో ఎన్నో స్టడీలు చెప్పాయని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త మందుల కోసం వెతకడం చాలా అవసరమని అన్నారు.

కరోనా వేరియంట్ల విషయంలో సౌత్ ఏషియన్లు గట్టోళ్లు

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ ఆసియా ప్రజలు జన్యుపరంగా తీవ్రమైన కరోనాకు గురికారని తాజా స్టడీ వెల్లడించింది. యూరోపియన్లలో కరోనా తీవ్రతకు కారణమైన జెనెటిక్ వేరియంట్లు సౌత్ ఏషియన్లలో కొవిడ్ ససెప్టబిలిటీలో ఎలాంటి పాత్ర పోషించకపోవచ్చని అభిప్రాయపడింది. మిగతా వారితో పోలిస్తే కొందరు వ్యక్తులు తీవ్రమైన లక్షణాలను, ప్రతికూల ఫలితాలను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీమ్ స్టడీ చేసింది. దక్షిణాసియా ప్రజల్లో కరోనా ప్రభావాలను నిర్ణయించడంలో డీఎన్‌‌‌‌ఏ సెగ్మెంట్ పాత్రను అనలైజ్ చేసింది. దక్షిణాసియా ప్రజల ప్రత్యేకమైన జన్యు మూలాన్ని.. మేం చేసిన స్టడీ రిజల్ట్ మరోసారి తెలియజెప్పిందని ఈ స్టడీ రచయిత ప్రజ్వాల్ ప్రతాప్ సింగ్ అన్నారు.