దేశంలో కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు కరోనా!.. వైరస్ కట్టడికి రెండే మార్గాలు: ఐఎంఏ

దేశంలో కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు కరోనా!.. వైరస్ కట్టడికి రెండే మార్గాలు: ఐఎంఏ

దేశంలో ప్రతి రోజూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకీ పరిస్థితి దిగజారుతోందని, వైరస్ వ్యాప్తిలో కమ్యూనిటీ స్ప్రెడ్ దశ మొదలైందని అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాస్పిటల్ బోర్డు చైర్‌పర్సన్ డాక్టర్ వీకే మోంగా. కరోనా కేసుల ప్రతి రోజూ 30 వేలకు పైగా నమోదవుతున్నాయని, దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారాయన. దీనికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. సామూహిక వ్యాప్తికి ఇది సూచన అని చెప్పారాయన.

వైరస్‌ను ఎదుర్కొనేందుకు రెండే మార్గాలు

మొదట్లో పెద్ద పెద్ద నగరాల్లోనే కనిపించిన కరోనా కేసులు ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ పెరిగాయని, ఇది వైరస్ వ్యాప్తి కట్టడిని చాలా కష్టతరంగా మార్చిందని అన్నారు మోంగా. ఢిల్లీలో కరోనాను కంట్రోల్ చేయగలిగామని, అయితే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో వస్తున్నకొత్త హాట్‌స్పాట్స్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారాయన. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత జాగరూకతతో వ్యవహకరించాలని, పరిస్థితులను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు కేంద్రం సహకారం తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందే వైరల్ డిసీజ్ అని దీనిని ఎదుర్కొనేందుకు రెండే మార్గాలు ఉన్నాయని చెప్పారు మోంగా. దేశంలోని 70 శాతం జనాభాకు వైరస్ సోకి ఆ తర్వాత దాన్ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి రావడం తొలి ఆప్షన్ అని, రెండో మార్గం వ్యాక్సినేషన్ రావడమేనని ఆయన అన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ దశలోకి రాలేదని కేంద్రం పలు సందర్భాల్లో చెబుతూ వస్తోంది.