
- మృతుల్లో బీజేపీ నేత, లాయర్
- గన్‌తో కాల్చి పారిపోయిన దుండగులు
- వరుస ఘటనలతో ప్రభుత్వంపై అపోజిషన్ నేతల మండిపాటు
పాట్న: కాల్పుల మోతతో బిహార్ దద్దరిల్లింది. 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. మృతుల్లో బీజేపీ నేత, గ్రాసరీ షాప్ ఓనర్, లాయర్‌తో పాటు ఓ వ్యాపారవేత్త ఉన్నారు. దండగులు బైక్‌లపై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. వరుస కాల్పుల ఘటనలపై ప్రతిపక్ష నేతలు నితీశ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని, నితీశ్‌కుమార్‌కు పాలన చేతకావడం లేదని ఫైర్ అవుతున్నారు. కాగా, గురువారం పాట్నలోని సుల్తాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 58 ఏండ్ల అడ్వకేట్ జితేంద్ర కుమార్ మహతోను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రోజులాగే హోటల్లో చాయ్ తాగి ఇంటికి వెళ్తున్న జితేంద్రకుమార్‌పై కాల్పులు జరిపారు. స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 3 బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం సీతామర్హి జిల్లా మెహసూల్ చౌక్‌లో పుటు ఖాన్ అనే వ్యాపారవేత్తను దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు.
దీంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. శనివారం రాత్రి పాట్న జిల్లా షేక్‌పురా గ్రామంలో వెటర్నరీ డాక్టర్ అయిన 50 ఏండ్ల సురేంద్ర కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతన్ని పాట్నలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయారని డాక్టర్లు తెలిపారు. సురేంద్ర కుమార్ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షుడు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గోపాల్ రవిదాస్, మాజీ మంత్రి శ్యామ్ రజాక్ ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాల్పులు జరిపిన దుండగులను పట్టుకోవాలని పోలీసులను కోరారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించి కొన్ని ఎవిడెన్స్ సేకరించింది. శుక్రవారం సాయంత్రం పాట్న రామకృష్ణ నగర్ ఏరియాలో ఓ గ్రాసరీ షాప్ ఓనర్ విక్రమ్ ఝాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాగా, ఈ నెల 4వ తేదీన బిహార్‌లోని మగధ హాస్పిటల్ ఓనర్ గోపాల్ ఖేమ్కాను పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో కాల్చి చంపారు.