శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లకు ఇలాంటి శిక్షలే కరెక్ట్

శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లకు ఇలాంటి శిక్షలే కరెక్ట్

నల్గొండ అర్బన్‍, వెలుగు: హాజీపూర్​ కేసులలో కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించామని, నిందితుడు శ్రీనివాస్​రెడ్డికి రెండు కేసుల్లో ఉరిశిక్ష, మరో కేసులో యావజ్జీవ శిక్ష పడిందని రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్​ భగవత్​ తెలిపారు. అలాంటివారికి ఇలాంటి శిక్షలే సరైనవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. కోర్టు తీర్పు అనంతరం నల్గొండలో మీడియాతో సీపీ మాట్లాడారు. శ్రీనివాస్​రెడ్డి గతంలో కర్నూలు జిల్లాలో సెక్స్ వర్కర్ ను డబ్బుల విషయమై హత్య చేశాడని తెలిపారు. హాజీపూర్ ​కేసుల్లో అతడ్ని అదుపులోకి తీసుకొని.. సైంటిఫిక్, ఫోరెన్సిక్  ఆధారాలను కోర్టు ముందుంచామని చెప్పారు. మొత్తం 101 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టామని, 150కి పైగా డాక్యుమెంట్లను, వస్తువులను సమర్పించామని వివరించారు. మంచి టీం వర్క్ తో కేసులో పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో హాజీపూర్​లో కొంత ఉద్రిక్త వాతావరనం ఏర్పడిందని, ఆ తర్వాత గ్రామస్తులు, బాధిత కుంటుంబీకులు సహకరించారని చెప్పారు. శ్రావణి , మనీషా కేసుల్లో శ్రీనివాస్​రెడ్డికి ఉరి శిక్ష, కల్పన కేస్ లో యావజ్జీవ శిక్షను కోర్టు విధించిందని తెలిపారు. ఈ కేసులో భువనగిరి ఏసీపీ భుజంగరావు, డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్‍ సీపీ  సుధీర్‍బాబు, భువనగిరి రూరల్‍ సీఐ సురేందర్ రెడ్డి పని చేశారని చెప్పారు.

హాజీపూర్​కు బస్సు వేయించినం

హాజీపూర్‍  గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇలాంటి హత్యలు జరిగాయని భావించి గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటు, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. అక్కడ ఇప్పటికీ  పోలీస్‍ పికెట్‍ను కొనసాగిస్తున్నామన్నారు. స్పెషల్​ పీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయం గెలుస్తుందని ఈ తీర్పుతో రుజువైందని అన్నారు