నాసిరకం విత్తనాల కట్టడికి చర్యలు : సీపీ సునీల్ దత్

నాసిరకం విత్తనాల కట్టడికి చర్యలు : సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు :  నాసిరకం విత్తనాల కట్టడికి పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీసు బలగాలతో 21 జాయింట్  టాస్క్ ఫోర్స్ టీమ్​లను ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. బుధవారం ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా, దుకాణాలలో, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని చెప్పారు. ప్రధానంగా గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లో విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఏ ప్రాంతంలోనైనా కచ్చితమైన కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు కానీ, మండల వ్యవసాయ శాఖ అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా పరిధిలోని విత్తన ఎరువుల దుకాణాలు, గోడౌన్​ల్లో తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నాసిరకం విత్తనాలను నియంత్రించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.