హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ఐనవోలు మండలం వెంకటాపూర్ లో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వెంకటాపూర్ గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంకటాపూర్ అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకుని, ఆ భూమిని తిరిగి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి పాల్గొన్నారు.
