
గరిడేపల్లి, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అధికారులను కోరారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెం గ్రామంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో సరిపోను నీళ్లు ఉండి కూడా ఇవ్వకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి అప్పయ్య, రైతు సంఘం నాయకులు కుందూరు వెంకటరెడ్డి, అంబటి వెంకరెడ్డి, పోకల ఆంజనేయులు, పంగ గోవిందు, బక్కయ్య, ఈదయ్య, నందిపాటి కాశయ్య పాల్గొన్నారు.