సీపీఐ నారాయణ కాలికి గాయం.. కట్టుకట్టిన తిరుపతి ఎంపీ

సీపీఐ నారాయణ కాలికి గాయం.. కట్టుకట్టిన తిరుపతి ఎంపీ
  • రాయలచెరువు సందర్శనకు వెళ్లి కొండెక్కి దిగుతుండగా బెణికిన కాలు
  • ప్రాథమిక చికిత్స చేసి కట్టుకట్టిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

చిత్తూరు: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కాలికి గాయమైంది. చిత్తూరు జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను మంగళవారం పార్టీ నాయకులతో కలసి సందర్శిస్తున్న  ఆయన తిరుపతి రాయల చెరువు ను పరిశీలించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరుకు చేరుకుని అక్కడి నుండి కొండపైకి ఎక్కారు. సుమారు కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. 
రాయలచెరువు వద్ద కొండ నుండి దిగే సమయంలో కాలు బెణికింది. కుడి కాలు వెంటనే వాపు రావడంతో నొప్పితో ఆయన పైకి లేవలేక అక్కడే కూర్చుండిపోయారు. అయితే అదే సమయంలో చెరువు కట్ట ను పరిశీలించేందుకు వైసీపీ నేతలతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు అటువైపు వచ్చారు. సీపీఐ నారాయణను గుర్తించి పలుకరించారు. కాలు బెణకడంతో నడవలేక కూర్చుండిపోయారని తెలియడంతో వైద్యుడైన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి నారాయణ కాలికి అయిన గాయాన్ని పరిశీలించారు. ప్రాథమిక చికిత్స చేసి తాత్కాలికంగా కట్టు కట్టారు. అనంతరం వైసీపీ నాయకులు తమ వాహనంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.