భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం : కూనంనేని

భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం : కూనంనేని

హనుమకొండ : రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. తమకు నెల రోజుల సమయం ఇస్తే పోడు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి (FRO) శ్రీనివాసరావున హత్యను ఖండిస్తున్నామని చెప్పారు. ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందికి విధి నిర్వహణలో ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తామని, అయితే.. అదంతా టీఆర్ఎస్ చేతిలోనే ఉందన్నారు. బీజేపీపై ఇప్పుడు చేస్తున్నట్లుగానే పోరాటం చేస్తేనే తమ మద్దతు టీఆర్ఎస్ కు ఉంటుందని చెప్పారు. 

కేంద్రం కక్ష సాధింపు చర్యలు

దేశంలో అరాచకం కొనసాగుతోందని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. డిక్టేటర్ లా ప్రధాని మోడీ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో కూడా ఇలా లేదని చెప్పారు. ‘ప్రతిపక్ష ముక్త్ భారతే మోడీ విధానం’ అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రధాని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందన్నారు. కేంద్రం 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిందన్నారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విఫలయత్నం చేసిందని ఆరోపించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 3 వేలకు పైగా ఈడీ దాడులు చేస్తే.. అందులో కేవలం 25 కేసులు మాత్రమే పెట్టారని చెప్పారు. విపక్ష నాయకులను లొంగదీసుకునేందుకే ఈడీ, ఐటీ దాడులన్నారు. 

బండి సంజయ్ కు సవాల్ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ కు తడి బట్టలతో గుడిలో ప్రమాణం చేయడమే తెలుసని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. సిట్ బృందం అమిత్ షాకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను విమర్శించే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ‘సీపీఐ వర్సెస్ బీజేపీగా పోటీ చేద్దాం.. దమ్ముంటే రా’ అంటూ సవాల్ విసిరారు.