మతోన్మాద బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యం : బీవీ రాఘవులు,తమ్మినేని వీరభద్రం

మతోన్మాద బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యం : బీవీ రాఘవులు,తమ్మినేని వీరభద్రం
  •     సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

భద్రాచలం,వెలుగు :  తెలంగాణ లో మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ తో పొత్తు కోసం చర్చలు జరిపామని, పదవులు, పలుకుబడి కోసం వెంపర్లాడలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అన్నారు.  భద్రాచలం నియోజకవర్గ సీపీఎం అభ్యర్ధి కారం పుల్లయ్య నామినేషన్​ కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో బుధవారం వారు పాల్గొని ప్రసంగించారు.

మతోన్మాదుల చేతుల్లోకి తెలంగాణ పోకూడదనే తమ ప్రయత్నం అన్నారు. భద్రాచలం గడ్డపై ఎంతో మంది పార్టీ నాయకత్వం తమ ప్రాణాలను ధారపోసి ఏజెన్సీని కాపాడారని గుర్తు చేశారు. అమరవీరుల వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న కారం పుల్లయ్య భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు. దళిత బంధు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్​కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వస్తున్న బీఆర్​ఎస్​ అభ్యర్ధి తెల్లం వెంకట్రావులను నమ్మొద్దన్నారు.

గత పదేళ్లలో బీఆర్​ఎస్ ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. ఎంపీ, మంత్రులు, సర్పంచ్​లు, ఎంపీపీటీలు, జడ్పీటీసీలు ఉన్న అధికార పార్టీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. సీపీఎం అభ్యర్ధులు ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి నిధులు సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు. మన్యానికి రక్షణ ఎర్రజెండాయేనని పేర్కొన్నారు. నియోజకవర్గ కన్వీనర్​ మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, పోతినేని సుదర్శన్​, బండారు రవికుమార్​, అన్నవరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో ఆఫీసుకు ర్యాలీగా వెళ్లి కారం పుల్లయ్య నామినేషన్ దాఖలు చేశారు.