భువనగిరి బరిలో సీపీఎం..ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ 

భువనగిరి బరిలో సీపీఎం..ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ 
  •     ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ 
  •     ప్రకటించిన పార్టీ రాష్ట్ర కమిటీ 

హైదరాబాద్, వెలుగు :  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్​ను అభ్యర్థిగా నిలుపుతున్నట్టు వెల్లడించింది. బుధవారం ఎంబీభవన్ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్​ వీరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న బలం ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. మిగిలిన16 స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేసిందని చెప్పారు.  మిగిలిన వాటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో జాతీయస్థాయిలో ఇండియా కూటమి ఏర్పడిందని, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించే నిర్ణయమే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కలిసి పనిచేస్తే.. రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతుందని చెప్పారు. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండలో తమకు బలం ఉన్నదని తెలిపారు. కూటమిలో భాగంగా ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినా..

తాము సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి కలిసి పోటీ చేయాలనే దానిపై ప్రతిపాదన రాలేదని, వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భువనగిరి జిల్లాలో అనేక సమస్యలపై జహంగీర్ పోరాటాలు చేశారని, మూసీ సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర కూడా చేశారని గుర్తుచేశారు. ప్రెస్ మీట్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, టీ.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, అభ్యర్థి జహంగీర్ పాల్గొన్నారు.