ఆపరేషన్‌‌ సింధూర్‌‌పై కేంద్రం అబద్ధాలు : తమ్మినేని వీరభద్రం

 ఆపరేషన్‌‌ సింధూర్‌‌పై కేంద్రం అబద్ధాలు : తమ్మినేని వీరభద్రం
  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం 

నల్గొండ అర్బన్, వెలుగు : ఆపరేషన్‌‌ సింధూర్‌‌పై కేంద్రం అనేక అబద్ధాలు చెప్పిందని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌ డైరెక్ట్‌‌గా చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. నల్గొండలోని కోటిరెడ్డి ఫంక్షన్‌‌హాల్‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలని కోరారు. పాకిస్తాన్‌‌ సైన్యాధికారి మునీర్‌‌కు.. ట్రంప్ విందు ఇవ్వడం మన దేశాన్ని అవమానించినట్లేనన్నారు. ట్రంప్‌‌ వ్యాఖ్యలను ఖండించే ధైర్యం మోదీకి లేదని ఎద్దేవా చేశారు. ముస్లిం, మైనార్టీల పౌరసత్వాలను రద్దు చేసేందుకు కేంద్ర కుట్ర చేస్తోందని ఆరోపించారు. బిహార్‌‌ ఎన్నికల టైంలో 65 లక్షల ఓట్లను తొలగించారని మండిపడ్డారు.

పౌరసత్వం పేరుతో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాళేశ్వరం, బనకచర్ల పేరిట ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని ఎన్నికల ముందే రేవంత్‌‌రెడ్డికి తెలుసని.. అయినా ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి ఇప్పుడు ఆలస్యం చేయడం సరికాదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌‌రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్‌‌ మల్లేశ్‌‌ పాల్గొన్నారు.