బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం

 బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
  • ప్రజా సమస్యలను వదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలు
  • బడుగులకు రాజ్యాంగ ప్రయోజనాలు దక్కకుండా బీజేపీ కుట్ర 
  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కామెంట్స్

సూర్యాపేట, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటూ.. ప్రజా సమస్యలు వదిలిలేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు.  రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్ అంటూ టికెట్ లేని సినిమా చూపిస్తున్నారని ఆరోపించారు. 

దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని, పౌర హక్కులను అణిచివేసే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో భాగంగా గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. 

బిహార్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సర్వే పేరుతో ఆర్ఎస్ఎస్ మత సిద్ధాంతాలను అమలు చేయడానికి కేంద్రంలోని బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకతపై పార్లమెంటులో చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ లెక్కల్లో వేశారని, 42 శాతం అమలును ఓ వైపు బీజేపీ వ్యతిరేకిస్తూనే, మరోవైపు బిహార్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే దేశవ్యాప్త బీసీ జనగణనకు ఆమోదం తెలిపిందని ఎద్దేవా చేశారు. 

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా బడుగులకు దక్కిన ప్రయోజనాలను లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్​ లో బడుగుల హక్కుల సాధనకు, అభ్యున్నతికి సీపీఎం పోరాటాలు ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.