కాళేశ్వరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి సీపీఎం లేఖ

కాళేశ్వరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి సీపీఎం లేఖ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. మంగళవారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌‌‌‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్య, టి.సాగర్‌‌‌‌ సంయుక్తంగా లేఖ రాశారు. తామంతా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించినట్లు చెప్పారు. మేడిగడ్డ పిల్లర్లు రోజురోజుకూ మరింత కుంగుతున్నాయని.. వర్షాలు పడితే మరింత వేగంగా కుంగిపోయే ప్రమాదం ఉందని వివరించారు. 

అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడిన చోటును తాత్కాలికంగా పూడ్చినప్పటికీ ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రైవేటు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో రీడిజైన్‌‌‌‌ చేసిన ప్రాజెక్టు భవిష్యత్తు గురించి నేషనల్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ సూచనలు, ఇతర నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అఖిలపక్షం ముందుంచాలని కోరారు. శ్రీరాంసాగర్‌‌‌‌, మానేరు, మల్లన్నసాగర్‌‌‌‌ తదితర జలాశయాలలో నీటి నిల్వపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని తమ లేఖలో ప్రస్తావించారు.