
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్... కొత్త చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇటీవల ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోసారి నటిగా ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జంటగా ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో ‘పూజా మేరీ జాన్’ అనే మూవీ చేస్తోంది. ఇటు తెలుగు, అటు హిందీలో సినిమాలు చేస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తోన్న ఆమె, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెట్టింది.
రెండు క్రేజీ కోలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా మృణాల్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ‘విడాముయర్చి’ చిత్రంలో నటిస్తున్న అజిత్.. దీని తర్వాత ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ నటించనుందని సమాచారం. శింబు హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్టు ప్రచారంలో ఉంది. ఇక శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా మృణాల్ పేరు వినిపించింది. అయితే ఆ స్థానంలో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను ఫైనల్ చేశారు. మరి అజిత్, శింబు సినిమాల్లో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి!