క్లెడిట్ కార్డ్ సడెన్‌గా బ్లాక్ అయ్యిందా..? సైబర్ అటాక్ కాదు.. ఇలా చేస్తే వెంటనే అన్‌బ్లాక్

క్లెడిట్ కార్డ్ సడెన్‌గా బ్లాక్ అయ్యిందా..? సైబర్ అటాక్ కాదు.. ఇలా చేస్తే వెంటనే అన్‌బ్లాక్

రెస్టారెంట్‌లో బిల్లు కట్టేటప్పుడో, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడో లేదా విదేశీ ప్రయాణాల్లో ఉన్నప్పుడో అప్పటివరకు బాగానే పనిచేసిన క్రెడిట్ కార్డ్ అకస్మాత్తుగా బ్లాక్ అయితే ఎవరికైనా ఒక్కసారిగా కంగారు పుడుతుంది. లావాదేవీ రిజెక్ట్ కాగానే చాలామంది తమ కార్డ్ హ్యాకింగ్‌కు గురైందని లేదంటే ఎవరో మోసం చేశారని భయపడతారు. ప్రస్తుతం బ్యాంకులు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయడానికి అనేక భద్రతా కారణాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం తాత్కాలికమైనవే కాబట్టి.. ఆందోళన చెందకుండా అసలు సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకోవడం ముఖ్యం. సమస్య ఏంటో తెలియకుండా పదే పదే కార్డ్ ఉపయోగించడానికి ప్రయత్నించడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరం అవుతుంది.

కార్డ్ బ్లాక్ అయినప్పుడు మొదటగా బ్యాంక్ నుండి వచ్చిన ఎస్ఎమ్‌ఎస్, ఈమెయిల్, యాప్ నోటిఫికేషన్లను పరిశీలించాలి. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలు అనుమానాస్పద లావాదేవీలను 24 గంటలూ పసిగడుతుంటాయి. మీరు ఎప్పుడూ లేనిది అకస్మాత్తుగా వేరే ఊరిలో లేదా విదేశాలలో పెద్ద మొత్తంలో షాపింగ్ చేసినా.. వరుసగా తప్పుడు పిన్ నంబర్ ఎంటర్ చేసినా బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ ఆటోమేటిక్‌గా కార్డ్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడుతుంది. ఇలాంటి సమయాల్లో బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి సదరు లావాదేవీని మీరే చేశారని కన్ఫర్మ్ చేస్తే కార్డ్ వెంటనే అన్‌బ్లాక్ అవుతుంది.

మరో ప్రధాన కారణం క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం. గడువు ముగిసినా కనీస బకాయిలు కట్టకపోయినా, అకౌంట్లో బ్యాలెన్స్ లేక ఆటో-డెబిట్ ఫెయిల్ అయినా బ్యాంకులు కార్డును నిలిపివేస్తాయి. మీ క్రెడిట్ లిమిట్ దాటినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఇవేవీ కాకపోతే.. KYC అప్‌డేట్ పెండింగ్‌లో ఉండటం.. పాన్ కార్డ్ వివరాలు తప్పుగా ఉండటం వల్ల కూడా బ్యాంకులు లావాదేవీలను నిలిపివేస్తుంటాయి. కొత్త కార్డుల్లో అంతర్జాతీయ లావాదేవీల ఆప్షన్ డీఫాల్ట్‌గా డిసేబుల్ అయి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా దీనిని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.

కార్డ్ రీడర్ లేదా వెబ్‌సైట్లలో లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు.. కస్టమర్ కేర్‌ను సంప్రదించకుండా పదే పదే ప్రయత్నించడం అతిపెద్ద పొరపాటు. ఇలా చేయడం వల్ల బ్యాంక్ సాఫ్ట్‌వేర్ మిమ్మల్ని ఫ్రాడ్‌గా భావించి కార్డును పూర్తిగా బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ అనుమతి లేకుండానే ఏదైనా లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కార్డును ఫ్రీజ్ చేసి బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం సైబర్ మోసాలపై ఎంత వేగంగా స్పందిస్తే.. అంతగా ఆర్థిక నష్టాల నుండి తప్పించుకోవచ్చు. బిల్లులు కట్టడం, కేవైసీ అప్‌డేట్ చేయడం, కస్టమర్ కేర్ వెరిఫికేషన్ ద్వారా క్రెడిట్ కార్డులను సులభంగా తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కార్డ్ బ్లాక్ అయిందే కంగారు పడకుండా సరైన పద్ధతిలో దానిని డీల్ చేయటం మంచిది.