క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్టు

క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్టు
  •     15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  •     రూ.3.29 కోట్లు సీజ్ 
  •     పరారీలో ప్రధాన ఆర్గనైజర్లు

గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల క్రికెట్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న ఐదు గ్యాంగ్​లను మాదాపూర్, శంషాబాద్, బాలానగర్  జోన్  ఎస్ఓటీ  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 మందిని అరెస్టు​ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.29 కోట్ల నగదు, తదితర వస్తువులను సీజ్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్​పల్లి బాలాజీ నగర్​కు చెందిన సురేశ్ (42) ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్నాడని మాచారం అందుకున్న శంషాబాద్​ జోన్​ ఎస్ఓటీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

 సురేశ్  ఇచ్చిన సమాచారంతో వికారాబాద్​కు చెందిన పంటర్​ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు రామాంజనేయులు పరారీలో ఉన్నాడని రామకృష్ణ తెలిపాడు. సురేశ్, రామకృష్ణ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.79.99 లక్షలను పోలీసులుచేశారు. అలాగే రూ.1.90 లక్షల విలువైన సెల్​ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. 

మరో కేసులో దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మల్లంపేట గ్రామంలో ఆన్​లైన్​లో క్రికెట్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న చిన్నబాబు, కరీముల్లా, వెంకటేశ్,  రమేష్​ను శంషాబాద్​ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.21 లక్షలు సీజ్​ చేశారు. నగదుతో పాటు రూ.4.84 లక్షల విలువైన స్మార్ట్​ఫోన్లు, రెండు ల్యాప్​ట్యాప్​లు, కీప్యాడ్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్​ ముఠాకి చెందిన ప్రధాన నిర్వాహకుడు కల్యాణ్​ పరారీలో ఉన్నాడు. 

మాదాపూర్​ జోన్​లో

మియాపూర్​లో ఓ అపార్ట్​మెంట్​లో ఆన్​లైన్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్​ జోన్​ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అదే అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే వీర శంకర్​చారి, కేపీహెచ్ బీ కాలనీకి చెందిన రాంప్రసాద్​రెడ్డి, బోడుప్పల్​కు చెందిన మురళి, గాజుల రామారానికి చెందిన వంశీకృష్ణ ఆర్గనైజర్లుగా బెట్టింగ్​ నిర్వహిస్తున్నారు. వారి వద్ద నుంచి రూ.1.44 కోట్ల డబ్బును సీజ్​ చేశారు. రూ.80 లక్షల విలువైన కమ్యూనికేషన్​ బోర్డులు, స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు, బెంజ్ ​కారు, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

మెయిన్​ ఆర్గనైజర్లుగా ఉన్న బెంగుళూరుకు చెందిన రాజేష్​రెడ్డి, గచ్చిబౌలికి చెందిన సురేష్​రెడ్డి, అనంతపురానికి చెందిన నాగార్జునరెడ్డి, కూకట్​పల్లికి చెందిన సాదిక్​ పరారీలో ఉన్నారు. అలాగే  బాలానగర్ లో  ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న గాజుల రామారం హెచ్ఏఎల్​ కాలనీకి చెందిన అజయ్​కుమార్, మహేష్​ కుమార్ ను​బాలానగర్  ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెయిన్​ ఆర్గనైజర్​ నరేష్​ పరారీలో ఉన్నాడని నిందితులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.93 వేల నగదు సీజ్​ చేశారు. రూ.లక్ష విలువైన రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

బాచుపల్లిలో ముగ్గురు బుకీలు..

బాచుపల్లిలో క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముగ్గురు బుకీలను బాలానగర్​ జోన్​ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బాచుపల్లి సాయినగర్​కు చెందిన శ్రీకాంత్​ రెడ్డి, నిజాంపేట శ్రీనివాస్​నగర్​కు చెందిన అల్లీ లోకేష్​, బాచుపల్లి సాయినగర్​కు చెందిన వెంకట సునీల్​గా గుర్తించారు. నిందితులను విచారించగా ప్రధాన ఆర్గనైజర్లు నీలేష్​, బుద్దారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13.30 లక్షలు సీజ్​ చేశారు. అలాగే రూ.1.83 లక్షల విలువైన స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు, కీప్యాడ్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.