బెట్టింగ్ తో బతుకులు ఆగం .. రూ.లక్షల్లో నష్టపోతున్న బాధితులు

బెట్టింగ్ తో బతుకులు ఆగం ..   రూ.లక్షల్లో నష్టపోతున్న బాధితులు
  • యూత్, కుటుంబాల్లో బెట్టింగ్ ల చిచ్చు
  • అప్పులు, లోన్లు తీర్చలేక ఆర్థికంగా కష్టాలు
  • బెట్టింగ్​ యాప్స్ పై నిషేధం ఉన్నా.. కొత్తగా వందల్లో పుట్టుకొస్తున్నయ్ 

హైదరాబాద్, వెలుగు:  ఆన్ లైన్ బెట్టింగ్ లు యువత, కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నాయి. బెట్టింగ్ ల కోసం అప్పులు చేస్తూ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద అప్పులే కాకుండా ఆన్​లైన్​లోనూ యాప్ లోన్లు తీసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో రూ. లక్షల్లో నష్టపోతున్నారు. చివరకు తీర్చలేక చావుదాకా తెచ్చుకుంటున్నారు. క్రికెట్​బెట్టింగ్ మాత్రమే కాదు. ఎలక్షన్స్, కబడ్డీ, సినిమా కలెక్షన్స్.. ఇలా సీజన్​ను బట్టి బెట్టింగ్​లు కాస్తున్నారు.  బెట్టింగ్ ల్లో డబ్బులు కోల్పోయిన బాధితులు పరువుపోతుందనే భయంతో బయటకు చెప్పుకోవడంలేదు. పోలీసులకు కూడా కంప్లయింట్ చేయడంలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడే ఇలాంటివి బయటకు వస్తున్నాయి. 

అప్పులు, లోన్లు తీసుకుంటూ..  

 ప్రస్తుతం ఐపీఎల్ సీజన్​కావడంతో జోరుగా క్రికెట్  బెట్టింగ్ లు నడుస్తున్నాయి.  ఒకటికి రెండుసార్లు అధికంగా డబ్బులు రావడంతో... అత్యాశకు పోయి భారీ మొత్తంలో బెట్టింగ్​పెట్టి నష్టపోతున్నారు. అప్పులు, అధిక వడ్డీలకు ఆన్​లైన్​లో లోన్లు తీసుకుని పెడుతున్నారు.  టైమ్​కు  ఈఎంఐలు చెల్లించలేకపోతుండగా లోన్ యాప్​నిర్వాహకులు పెట్టి వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోన్ యాప్స్​నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్​యాప్స్​పై నిషేధం ఉన్నా కూడా రోజుకు వందల్లో యాప్స్​పుట్టుకొస్తున్నాయి. యూ ట్యూబ్, సోషల్​మీడియా, వెబ్​సైట్లలో వంద పెడితే వెయ్యి అంటూ బెట్టింగ్​యాప్స్ ప్రకటనలు ఇస్తున్నాయి. ఆశ పెట్టి చివరకు జనాల జేబులకు చిల్లుపెడుతున్నాయి. వన్ ఎక్స్​ బెట్, మెగాపరి, మేట్​బెట్, బెట్365, డఫ్పా బెట్​లాంటి వెబ్​సైట్స్, యాప్స్​లో  ప్రస్తుతం బెట్టింగ్​జోరుగా నడుస్తుంది.  సాధారంగా ఆన్​లైన్​ బెట్టింగ్స్​లో నష్టపోయిన బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేయడంలేదు. ఇదే అదనుగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల దృష్టికి  వెళ్లిన  సైట్లను మాత్రమే బ్లాక్​ చేస్తున్నారు. 

మియాపూర్ లో నలుగురు బెట్టింగ్ బుకీలు అరెస్ట్

మియాపూర్: ఐపీఎల్ క్రికెట్​మ్యాచ్ లపై బెట్టింగ్​నిర్వహిస్తున్న నలుగురు బుకీలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్​స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలోని శ్రీనిధి సర్వీస్ అపార్ట్​మెంట్ ఫ్లాట్505లో క్రికెట్​బెట్టింగ్​నిర్వహిస్తున్నారని బుధవారం పోలీసులకు సమాచారం అందింది. మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు కలిసి రైడ్​చేసి, ఏపీలోని గుంటూరుకు చెందిన అల్లూరు త్రినాథ్(34), మనం రాజేశ్(33), బోలే స్వామి(30), మార్పెన్న గణపతి(57)ని అదుపులోకి తీసుకున్నారు. వీరు నలుగురు బుకీలుగా వ్యవహరిస్తూ.. ఆన్​లైన్​లో క్రికెట్ లైవ్ గురూ, లక్కీ యాప్​ల ద్వారా ఐపీఎల్​మ్యాచ్​లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరి నుంచి రూ.40 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్​కు వినియోగిస్తున్న అకౌంట్లలోని రూ.3లక్షల57వేల461 ఫ్రీజ్​చేశారు. 8 స్మార్ట్ ఫోన్లు, 2 కిప్యాడ్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్స్, 2 ట్యాబ్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు నర్సరావుపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావు అలియాస్ చిన్ను అనే వ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నాడు. 

కంప్లయింట్ వస్తే బ్లాక్​ చేస్తున్నాం 

క్రికెట్ బెట్టింగ్స్ పై యాప్స్​, వెబ్​సైట్స్​చాలా వస్తున్నాయి. మా దృష్టికి వచ్చిన వాటిని వెంటనే బ్లాక్​ చేస్తున్నాం. మళ్లీ  వేరే పేర్లతో లింక్స్​, యాప్స్​క్రియేట్ చేస్తున్నారు.  ఇలాంటివాటిపై ప్రజలు కూడా అవేర్​ నెస్​తో ఉండాలి. ఈజీ మనీ అంటేనే మోసపోతామని గుర్తించాలి.  
– శివ మారుతి, ఏసీపీ, సైబర్ క్రైమ్​ హైదరాబాద్