యువత ఆత్మనిర్భర్ భారత్‌‌లో భాగమవ్వాలి

యువత ఆత్మనిర్భర్ భారత్‌‌లో భాగమవ్వాలి

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై హిస్టారికల్ విక్టరీ సాధించిన టీమిండియాను ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ మనందరి దినచర్యలో భాగమని.. క్రికెట్ ఫీల్డ్ నుంచి కొవిడ్-19 మేనేజ్‌మెంట్ వరకు ఆ స్ఫూర్తి కొనసాగాలన్నారు. తేజ్‌‌పూర్ యూనివర్సిటీ 18వ కాన్వకేషన్ కార్యక్రమంలో మోడీ వర్చువల్‌‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ధైర్య సాహసాలతో సేవలందించిన హెల్త్ ప్రొఫెషనల్స్‌‌కు, వ్యాక్సిన్ కోసం క‌ృషి చేసిన సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం ఎందరో అమరులు ప్రాణాలను అర్పించాలని.. యువత నయా భారత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం బతకాలని, అందులో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.

‘ఆత్మనిర్భర్ భారత్ అనేది టెక్నాలజికల్ అడ్వాన్స్‌‌మెంట్‌‌లో పురోగతి సాధించడం కోసమే కాదని తెలుసుకోవాలి. అది దేశ ప్రజల దినచర్యలో భాగమని గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌‌లో టీమిండియా ప్లేయర్లు ప్రతి చాలెంజ్‌‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. గాయాలు వేధిస్తున్నా, తగిన అనుభవం లేకున్నా వీరోచితంగా పోరాడి నెగ్గారు. పాజిటివ్ మైండ్‌సెట్‌‌తో ఉంటే సానుకూల ఫలితాలే వస్తాయి. ఇదే ఆత్మనిర్భర్ భారత్ సారాంశం. ఓటమి భయాన్ని దాటాలంటే రిస్క్‌‌లు తీసుకోక తప్పదు. కరోనా మేనేజ్‌‌మెంట్‌‌తో వనరుల వాడకం, సమస్యల పరిష్కారంలో ఎలా వ్యవహరించాలనేది నేర్చుకున్నాం’ అని మోడీ పేర్కొన్నారు.