ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ

ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రయాణం రోజుకో మలుపు తీసుకుంటోంది. మూడ్రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన రాయుడు.. ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బుధవారం వీరిద్దరి భేటీ జరిగింది. దీంతో రాయుడు జనసేనలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.

గతేడాది చివరన వైఎస్సార్‌సీపీలో చేరిన రాయుడు.. ఈ నెల 6న ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. గుంటూరు లోక్ సభ స్థానం టికెట్‌ విషయమై వైసీపీ అధిష్టానం ఎలాంటి హామీ రాకపోవడంతో అతను పార్టీ వీడినట్లు ప్రచారం జరగ్గా.. ఆ వార్తలను భారత క్రికెటర్ కొట్టి పారేశారు. 

క్రికెట్ కోసమే..

త్వరలో దుబాయ్‌ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో తాను ఆడనున్నట్లు వెల్లడించారు. అందులో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని.. అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. ఈ ప్రకటన చేసిన రెండ్రోజులకే రాయుడు.. జనసేన అధినేతతో భేటీ అవ్వడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది మర్యాదపూర్వక భేటీయా..? లేదా జనసేనలో చేరుతున్నారా..? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.