- యూపీలో ఇండియా కూటమి నుంచి ఎన్నికైన ఏడుగురిపై క్రిమినల్ కేసులు
- రెండేండ్ల కన్నా ఎక్కువ జైలుశిక్ష పడితే సభ్యత్వం రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్లోఇండియా కూటమి నుంచి కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన ఏడుగురికి పదవీ ముప్పు పొంచి ఉంది. వారిపై వివిధ రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో వారికి రెండేండ్ల కన్నా ఎక్కువ కాలం జైలుశిక్ష పడితే ఆ ఎంపీల లోక్ సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. అఫ్జల్ అన్సారీ, ధర్మేంద్ర యాదవ్, బాబు సింగ్ కుశ్వాహా, రామ్ భౌల్ నిషాద్, వీరేంద్ర సింగ్, ఇమ్రాన్ మసూద్, చంద్రశేఖర్ ఆజాద్ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఘాజీపూర్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) తరపున పోటీచేసి ఎంపీగా ఎన్నికైన అఫ్జల్ అన్సారీని ఇప్పటికే గ్యాంగ్స్టర్ యాక్ట్ కేసులో కోర్టు దోషిగా తేల్చింది.
అతని శిక్షపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. దీంతో అతను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. వేసవి సెలవుల తర్వాత జులైలో అతని కేసుపై విచారణ జరగనుంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తే, అన్సారీ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. అలాగే ఆజంగఢ్లో ఎస్పీ తరపున పోటీచేసి గెలిచిన ధర్మేంద్ర యాదవ్ పై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసుల్లో ఏ ఒక్క కేసులో అయినా రెండేండ్ల కన్నా ఎక్కువ కాలం జైలుశిక్ష పడితే అతని లోక్ సభ సభ్యత్వం రద్దవుతుంది. జాన్ పూర్ లో జన్ అధికార్ పార్టీ తరపున పోటీచేసి ఎంపీగా ఎన్నికైన బాబు సింగ్ కుశ్వాహాపై ఎఆర్ హెచ్ఎంకు సంబంధించి వివిధ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
మాయావతి కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. మొత్తం 25 కేసుల్లో ఎనిమిదింట్లో అభియోగాలు నమోదయ్యాయి. సుల్తాన్ పూర్ లో ఎస్పీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రామ్ భౌల్ నిషాద్ పై 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి గ్యాంగ్ స్టర్ యాక్ట్ కేసు కూడా ఉంది. చందౌలిలో ఎస్పీ క్యాండిడేట్ గా పోటీచేసి ఎన్నికైన వీరేంద్ర సింగ్ కూడా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడు. సహరాన్ పూర్ లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎన్నికైన ఇమ్రాన్ మసూద్ పై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఒకటైన మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక ఆజాద్ సమాజ్ పార్టీ తరపున నాగినాలో పోటీచేసి గెలిచిన చంద్రశేఖర్ ఆజాద్ పై 30 కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసులో అయినా అతనికి రెండేండ్ల కన్నా ఎక్కువ జైలుశిక్ష పడితే అతని లోక్ సభ సభ్యత్వం రద్దవుతుంది.
గతంలో సభ్యత్వం కోల్పోయిన ఎంపీలు
గతంలో పలు క్రిమినల్ కేసుల్లో శిక్ష పడి పలువురు ఎంపీలు తమ సభ్యత్వాన్ని వదులుకున్నారు. వారిలో ప్రముఖంగా మొహమ్మద్ ఆజం ఖాన్, అతని కొడుకు అబ్దుల్లా ఆజం (ఎస్పీ) ఉన్నారు. అలాగే బీజేపీ తరపున ఎంపీలుగా ఎన్నికై లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన వారిలో ఖాబూ తివారీ, విక్రమ్ సైని, రామ్ దులార్ గోండ్, కుల్దీప్ సెంగార్, అశోక్ చందేల్ ఉన్నారు.